గెలుపు గుర్రం  షిరహట్టి ...!

11 May, 2018 21:57 IST|Sakshi
గెలుపు గుర్రం  షిరహట్టి ...!

షిరహట్టి సీటును గెలుచుకున్న పార్టీనే కర్ణాటకలో సర్కార్‌ను ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది.  1972 నుంచి కూడా ఇదే తీరు కొనసాగుతోంది. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో ఈ స్థానానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.  జనతాపార్టీ మొదలుకుని  కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌   వరకు గత 46 ఏళ్లుగా ఇక్కడి నుంచి గెలిచినవారు ఏ పార్టీలో ఉంటే అదే ప్రభుత్వం ఏర్పడుతూ వస్తోంది. ఒక్కో సందర్భంలో అధికారపార్టీకి చెందిన వారు ఓటమి పాలై ఇండిపెండెంట్‌ గెలిచినా, ఆ స్వతంత్ర ఎమ్మెల్యే చేరిన పార్టీనే అధికారానికి వస్తోంది. 

ఇదీ నియోజకవర్గం...
ముంబై కర్ణాటకలోని గదగ్‌ జిల్లాలోని 65వ నంబర్‌ నియోజకవర్గం షిరహట్టి. దాదాపు 2 లక్షల ఓటర్లు. 2013లో 71.8 శాతం ఓటింగ్‌ నమోదైంది.   20–49 ఏళ్లలోపున్న ఓటర్లు దాదాపు  81 శాతం ఉన్నారు.. వీరిలో 20–29 ఏళ్లలోపున్నవారు 31 శాతం, 30–39 ఏళ్లలోపున్నవారు 32 శాతమున్నారు. మతసామరస్యానికి షిరిహట్టి ప్రతీకగా నిలుస్తోంది. 450 ఏళ్లకు పైగా హిందువులు,ముస్లింలకు ఆరాధ్యనీయమైన శ్రీజగద్గురు ఫకిరీశ్వర మఠం ఇక్కడే ఉంది. ఈ మఠం ప్రధాన పూజారి సూఫీ, భక్తి మార్గాలను బోధిస్తారు. ప్రధాన పూజారి  మరణించాక హిందు, ఇస్లామ్‌ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు ఆచరిస్తారు. 

ఇదీ రికార్డ్‌...
–1972లో ఈ స్థానం నుంచి  కాంగ్రెస్‌ అభ్యర్థి డబ్ల్యూవీ వదిరాజ్‌ఆచార్య గెలిచారు. అప్పుడు దేవరాజ్‌ అర్స్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పడింది.1983 వరకు ఈ సీటుపై పట్టును కాంగ్రెస్‌ కొనసాగించింది. 
–1983లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉపనల్‌ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జనతాపార్టీకి మద్దతు ప్రకటించారు. అప్పుడు  రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 1985లోనూ జనతాపార్టీనే ఆ సీటును నిలుపుకోగా మళ్లీ హెగ్డే సీఎంగా ప్రమాణం చేశారు.
–1989లో మళ్లీ ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ గెలుచుకుంది. వీరేంద్రపాటిల్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఆ రాష్ట్రంలో మతఘర్షణలు తలెత్తడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ ఆయనను సీఎంగా తొలగించారు. ఆ తర్వాత ఇది కాంగ్రెస్‌ చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదంగా మిగిలిపోయింది. 
–1994లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఫకీరప్పను జనతాదళ్‌ టికెట్‌పై జీఎం మహంతషెట్టార్‌ ఓడించారు. దరిమిలా హేచ్‌డీ దేవెగౌడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 
–1999లో కాంగ్రెస్‌ మళ్లీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎస్‌ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది.
–2004 ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. షిరహట్టి నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ దక్కించుకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీ ఎస్‌తో జతకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొంత కాలానికి బీజేపీతో హేచ్‌డీ కుమారస్వామి చేతులు కలపడంతో ఈ సర్కార్‌ పతనమైంది.
–2008లో బీజేపీ తొలిసారిగా షిరహట్టిపై పట్టుసాధించింది. దక్షిణ భారత్‌లోనే మొదటిసారిగా బీఎస్‌యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 
–2013లో కాంగ్రెస్‌ మళ్లీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. సిద్ధరామయ్య సీఎం అయ్యారు. 
–ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొడ్డమని రామకృష్ణ షిడ్లింగప్పపై బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లామని పోటీ చేస్తున్నాడు.  గత ఎన్నికల్లోనే ఈ రెండుపార్టీల తరఫునే వీరే బరిలో నిలిచారు. కేవలం 315 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో షిడ్లింగప్ప గెలుపొందారు. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు