బీజేపీ ఒక హంతక పార్టీ : శివసేన

25 May, 2018 19:36 IST|Sakshi
శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ముంబై : ఈనెల(మే) 28న జరగనున్నపల్ఘార్‌ ఉప ఎన్నికలో గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ, శివసేన పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. పల్ఘార్‌లో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా శివసేన.. బీజేపీని మోసం చేసిందంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్‌ ఆరోపణలపై స్పందించిన శివసేన.. ‘ఉన్మాదిగా మారిన బీజేపీ తనకు అడ్డొచ్చిన వారందరినీ నరికి వేసుకుంటూ వెళ్లే ఒక హంతక పార్టీ’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈమేరకు తన పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని కూడా ప్రచురించింది.

‘పల్ఘార్‌ ఎంపీ చింతమన్‌ వనగా మరణం పట్ల బీజేపీ జాతీయ నాయకులెవరూ కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు. ఆయన కుటుంబాన్ని కూడా ఎవరూ పరామర్శించలేదు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా.. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన మరొకరికి అవకాశం ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహించడం తమ ప్రజాస్వామిక హక్కుగా బీజేపీ భావిస్తున్నట్టుంది. కర్ణాటక ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమంటూ’ శివసేన ఎద్దేవా చేసింది.
 
అంతేకాకుండా బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు మహారాష్ట్రకు వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కూడా శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రచారంలో భాగంగా మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో కపట నాయకుడు యోగి చెప్పులు కూడా విప్పకుండా ఆయనను అవమానించారు. తద్వారా ఛత్రపతి వంటి యోధులను బీజేపీ ఎంత గౌరవిస్తుందో ఇట్టే అర్థమైపోతుందంటూ’ సామ్నాలో పేర్కొంది.

కాగా, ఈ ఏడాది జనవరి 30న బీజేపీ ఎంపీ ఎంపీ చింతమన్‌ వనగా మరణించిన నేపథ్యంలో పల్ఘార్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ మాజీ నేత రాజేంద్ర గవిట్‌ను బీజేపీ నిలబెట్టింది. అంతేకాకుండా పల్ఘార్‌లో తమకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టవద్దంటూ శివసేనను కోరింది. అయితే బీజేపీ మాటను లెక్కచేయకుండా రాజేంద్ర గవిట్‌కు పోటీగా.. చింతమన్‌ కుమారుడు శ్రీనివాస్‌ను నిలబెట్టి బీజేపీకి గట్టి షాక్‌ ఇచ్చింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా