మహారాష్ట్ర రాజకీయాలు మహా ముదురే!!

2 Nov, 2019 11:09 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ బీజేపీ నేత సుధీర్‌ మృదుగంటివార్  వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఫలితాలొచ్చి వారం దాటిపోయినా ఇంకా శివసేనతో వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో బీజేపీ కొత్త ఎత్తుకి తెరలేపిందేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్‌ 8న ముగియనుందని, ఆ లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ బీజేపీ వ్యాఖ్యానించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బెదిరించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించింది.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాష్ట్రపతి బీజేపీ కంట్రోల్‌లో ఉన్నారా? లేదా రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా? అంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ప్రశ్నించింది. బీజేపీ వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల తీర్పును అగౌరవ పరిచేలా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రపతి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని.. రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి అత్యున్నత వ్యక్తి అని, యావత్ దేశానికి ప్రతినిధి అని చెప్పింది. ఈ దేశం ఏ ఒక్కరి జేబులో లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఎన్సీపీ స్పందన :
50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేని సంఘటస్థితికి చేరుకుంది. ఈ దశలో 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ  అధినేత శరద్ పవార్‌తో శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠను మరింత పెంచింది. ఏ క్షణం ఏం జరగుతుందో అన్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మీడియా ముందుకొచ్చిన శరద్‌ పవార్‌ తన మదిలో అంతరంగాన్ని బయటపెట్టారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఎన్సీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని, వారి తీర్పును మేము శిరసావహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, శివసేనలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై మాట్లాడుతూ.. ఈ దిశగా ఎన్సీపీలో ఎలాంటి సంప్రదదింపులు జరపలేదన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ - శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను ఇస్తే.. వారు చేస్తున్నదేంటి? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. శివసేన కోరితే మద్దతు ఇస్తామంటూనే కాంగ్రెస్ మరోసారి ప్రతిపక్షపాత్రకే పరిమితం అవుతామంటోంది. ఇలా ప్రతి పార్టీ కూడా రెండు రకాలుగా వ్యవహరిస్తుండటంతో మహానాటకం రక్తి కడుతోంది. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు