బీజేపీపై శివసేన ఘాటు వాఖ్యలు

2 Jul, 2018 16:34 IST|Sakshi

ఇందిర గాంధీ దేశానికి చేసిన సేవపై ప్రశంసల జల్లు

సాక్షి, ముంబై : ఎమర్జెన్సీ విషయంలో ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై మిత్రపక్షం శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. 1975లో విధించిన ఎమర్జెన్సీని సాకుగా చూపించి.. ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవను మర్చిపోవడం తగదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీని బీజేపీ నేతలు మరోసారి చర్చనీయాంశంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీలపై విమర్శిస్తూ తమ పార్టీ పత్రిక ‘ సామ్నా’ లో ఆదివారం వీకెండ్‌ కాలమ్‌ ఘాటుగా రాసుకొచ్చారు.

ప్రజాస్వామ్యానికి ఇందిర ఎంతో గౌరవం ఇచ్చారని... ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ఇందిరాకు ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం ఎంటో తెలుస్తుందన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి మహనీయులను తక్కువచేసి చూపించాలనుకోవడం సరైంది కాదని అన్నారు.

కేవలం ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఇందిరపై చెడుగా ముద్ర వేయాలనుకోవడం తగదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయని... ఆ నిర్ణయాలు కరెక్టా? తప్పా? అనేది ఎవరైనా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తప్పని పరిస్థితుల్లోనే ఇందిర ఎమర్జెన్సీని విధించి ఉండవచ్చని చెప్పారు.

ఇందిర ఎమర్జెన్సీని విధించిన రోజును బ్లాక్ డేగా నిర్వహించాలని అనుకుంటే... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో బ్లాక్ డేలను నిర్వహించాల్సి ఉంటుందని రౌత్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన రోజును కూడా బ్లాక్ డేగా జరుపుకోవాలని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది సామాన్యులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. చిన్న చిన్న వ్యాపారులు నష్టపోయారని తెలిపారు. బ్లాక్‌ మనీ బయటకు వస్తుందని ప్రధాని చెప్పారు..కానీ నల్ల కుబేరుల మనీ వైట్‌ మనీగా మరిందని ఎద్దేవా చేశారు. డబ్బుల కోసం క్యూలో నిలబడి ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న ఓ బ్యాంకు... నోట్ల రద్దు సమయంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 575 కోట్లను మార్పిడి చేసిందని ఆరోపించారు. 

ఎమర్జెన్సీ సమయంలో మీడియాకు స్వాతంత్ర్యం లేకుండా చేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు... కానీ నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీకి, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఏమాత్రం తేడా లేదని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అద్వానీని జైల్లో పెట్టారని... ఇప్పుడు కనీసం మాట్లాడలేని స్థితిలోకి ఆయనను నెట్టేశారని విమర్శించారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ, బీజేపీ నేతలులు భయపడుతున్నారని... అందుకే ఇందిరాగాంధీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో 50 సీట్లను కూడా గెలువని అస్థిపంజరం లాంటి కాంగ్రెస్‌కు బీజేపీ భయపడుతుందని ఎద్దేవా చేశారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మానసిక స్థితికి బాగాలేదని అందకు ఆయన మాటలే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడాలి అంతే కానీ 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని శివసేన పేర్కొంది.

మరిన్ని వార్తలు