రెండ్రోజుల్లో ప్రకటిస్తా: ఉద్ధవ్‌

21 Sep, 2019 05:01 IST|Sakshi

మహారాష్ట్రలో బీజేపీతో పొత్తుపై..

ముంబై: వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన–బీజేపీ కలిసే పోటీ చేస్తాయని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఎవరికెన్ని సీట్లనేది రెండ్రోజులు ప్రకటిస్తామని శుక్రవారం ఆయన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్‌ పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ముందే సీట్ల పంపకాలపై నిర్ణయించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఎవరికెన్ని సీట్లనేది ప్రకటిస్తామని చెప్పారు. ‘రెండు పార్టీలు చెరో 135 సీట్లలో పోటీచేస్తాయనేది మీడియానే ప్రచారం చేస్తోంది..’అని వ్యాఖ్యానించారు. అనంతరం శివసేన కార్యదర్శి అనిల్‌ దేశాయి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ముంబై పర్యటన ఉన్న నేపథ్యంలో ఆలోపే సీట్ల పంపకాల గురించి ప్రకటిస్తామని చెప్పారు. శివసేన–126, బీజేపీ–162 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.

ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరి యాణాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు నేడు లేదా రేపు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్నా యని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే దీపావళి(అక్టోబర్‌ 27వ తేదీ)కి ముందుగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం. మహారాష్ట్ర, హరియాణాలతో పాటు ఢిల్లీ, జార్ఖండ్‌ అసెంబ్లీల కు కూడా ఎన్నికలు జరిపే యోచనలోనూ ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.  జార్ఖండ్‌ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది.

మరిన్ని వార్తలు