గోమాతకేనా రక్షణ.. మాతృమూర్తికి లేదా?

23 Jul, 2018 17:59 IST|Sakshi

ముంబై : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. గోవుల సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న గుంపు దాడులు, మూక హత్యలు, మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే మహిళలకు ఏమాత్రం భద్రత లేని దేశంగా ఇండియా మారుతోందని, ఇది సిగ్గు చేటని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు.

‘గోమాతలను(ఆవులను) రక్షించుకోవడం మంచిదే కానీ మాత(మహిళ) సంగతేమిటి? ఇదేనా హిందుత్వం? ఇలాంటి వారు హిందువులే కాదు’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మేము ప్రభుత్వంలో భాగస్వామ్యులమే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. మేము భారతీయ జనతా(భారత ప్రజల)కు స్నేహితులం. అంతే కానీ ఏ పార్టీకి స్నేహితులం కాదు’ అని బీజేపీని ఉద్దేశించి అన్నారు.

దేశంలో మహిళల కంటే ఆవులకే భద్రత ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. గో రక్షణ పేరిట గోవులను కాపాడేదానికంటే బీఫ్‌​ ఎవరు తింటున్నారు, ఎవరు తినడం లేదు అనే దానిపైనే కొంత మంది దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఇదే హిందుత్వం అంటే నేను అంగీకరించను’ అని ఠాక్రే అన్నారు. దేశంలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు జాతీయ వాదులు,ఎవరు కాదో నిర్ణయించే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జాతీయవాదులు కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం(యూపీఏ) చేసిన తప్పిదాలనే ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు