-

మహా సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణం

28 Nov, 2019 19:31 IST|Sakshi

1966లో శివసేనను స్థాపించిన బాల్‌ఠాక్రే

ఠాక్రే కుటుంబం నుంచి సీఎం అయిన తొలి వ్యక్తి ఉద్ధవ్‌

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను కనుసైగలతో శాసించిన మహా నాయకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే. ఆయన నేతృత్వంలో పురుడుపోసుకున్న శివసేన పార్టీని మరాఠాలు ఆత్మబంధువుగా భావిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిప్పటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మరాఠా గడ్డపై 19 జూన్‌1966న శివసేన పార్టీని బాల్‌ ఠాక్రే స్థాపించారు. కరుడుగట్టిన హిందుత్వ వాదిగా పేరు మోసిన ఠాక్రే.. హిందుత్వ ఎజెండాను భూజానకెత్తుకుని పార్టీ సిద్ధాంతాలను మరాఠాల మెదళ్లకు ఎక్కించడంలో అద్భుతమైన విజయం సాధించారు. ఆయన కుమారుడే ఉద్ధవ్‌ ఠాక్రే. పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే బలమైన శక్తిగా శివసేన అవతరించింది. అయితే సేన ఎదుగుదల వెనుక బాలాసాహెబ్‌ బలమైన పునాదులే కారణమంటూ పలువురు మరాఠా నాయకులు అభిప్రాయపడుతుంటారు. ఆవిర్భావం నుంచి మరాఠా రిజర్వేషన్లు, ఐక్యత కోసం పోరాడుతూ ఒక్కోమెట్టు ఎదుగుతూ వచ్చింది శివసేన. కాంగ్రెస్‌ను కట్టడి చేయాలంటే భావసారూప్యత గల బీజేపీతో జట్టు కట్టి ఐక్యంగా సాగాలని బాల్‌ఠాక్రే భావించారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయీ హయాంలో ఎన్డీయే ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించారు. తమ పోరాటం కేవలం హిందుమత వ్యాప్తి, మరాఠాల రిజర్వేషన్ల కోసమే అని బహిరంగంగా ప్రకటించిన బాల్‌సాహెబ్‌.. ఠాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవ్వరూ ఎలాంటి ఉన్నత పదవులను చేపట్టరంటూ సంచలన ప్రకటన చేశారు.

బీజేపీకి గుడ్‌బై.. తండ్రి బాటకు స్వస్తి
ఈ సమయంలోనే సీఎం పదవిని అధిష్టించే అవకాశం శివసేనకు వచ్చింది. బాల్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తొలిసారి 1995లో సీఎం పదవిని కైవసం చేసుకుంది. 1995 నుంచి 1999 వరకు శివసేన నేత మనోహర్‌ జోషి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అనంతరం నారాయణ్‌ రానే కూడా శివసేన తరఫున ఆ పదవిని చేపట్టారు. అయితే బీజేపీతో సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికి.. తొలిసారి ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన ఖ్యాతిని దక్కించుకున్నారు. తండ్రి వేసిన బాటలకు స్వస్తిపలికిన ఉద్ధవ్‌.. అదే సమయంలో మహారాష్ట్ర సీఎం పీఠంపై శివ సైనికుడిని కూర్చోబెడతానంటూ తన తండ్రికి ఇచ్చిన మాటనూ నిలబెట్టుకున్నారు. దీంతో బీజేపీకి గుబ్‌బై చెప్పి ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు తొలిసారి సీఎం పదవి చేపట్టారు.

ఉద్దవ్‌ ఠాక్రే 1960, జూలై 27న ముంబైలో జన్మించారు. తండ్రి బాల్‌ ఠాక్రే​, తల్లి మీనాతాయ్‌ ఠాక్రే. భార్య రష్మి ఠాక్రే, కుమారుడు అదిత్యా ఠాక్రే. జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1985 బృహన్‌ ముంబై ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2002లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చారు. ఉద్ధవ్‌ వ్యూహాలు, చతురతను గమనించిన బాల్‌ఠాక్రే 2003లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. వెంటనే 2004లో శివసేన పార్టీ అధ్యక్ష (చీఫ్‌) బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు మొదలైన ఠాక్రే ప్రస్తానం.. ఇక వెనక్కి తిగిరి చూసుకోలేదు. బీజేపీతో స్నేహం చేస్తూనే పార్టీని పటిష్ట స్థితికి తీసుకువచ్చారు. ఉద్ధవ్‌ పార్టీ బాధ్యతలు చేపట్టిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో (2004) 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అనంతరం 2009లో 11, 2014లో 18, 2019లో 18 స్థానాలు సాధించి ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అవతరించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 63 స్థానాలను గెలిపించిన ఠాక్రే.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.


తొలి వ్యక్తిగా ఆదిత్యాఠాక్రే..
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఉద్ధవ్‌ అంత ప్రభావాన్ని చూపలేకపోయారు. దాదాపు 100కుపైగా స్థానాల్లో పోటీచేసి 56 స్థానాలకు పరిమితం అయ్యారు. అయితే సీఎం పీఠంను చెరిసగం పంచుకోవాలన్న ఉద్ధవ్‌ విజ్ఞప్తిని బీజేపీ నాయకత్వం తిరస్కరించింది. దీంతో ముప్పై ఏళ్ల బంధానికి ముగింపు పలకాలని భావించిన ఠాక్రే.. అదే సమయంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులుకలిపారు. చివరకు త్రిపక్షాల కూటమితో సీఎం పీఠంను అధిరోహించారు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పార్టీ స్థాపించి దాదాపు అర్థ దశాబ్ధం అవుతున్నా.. 2019 ఎన్నికల వరకు ఒక్కరు కూడా ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా పోటీ చేయకపోవడం విశేషం. తొలిసారి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ స్థానం నుంచి  ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్యా పోటీ చేసి విజయం సాధించారు. అయితే బీజేపీ-శివసేన బంధానికి బ్రేక్‌ పడిందా? లేక శాశ్వత ముగింపు పలికిందా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

మరిన్ని వార్తలు