మహా ‘సస్పెన్స్‌’..!

29 Oct, 2019 01:47 IST|Sakshi

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన

బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి   అధికారం సమం కావాలంటున్న సేన

మెజారిటీలేక ఇరుకునపడిన బీజేపీ

బుధవారం ముంబైకి అమిత్‌ షా రాక

ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా షోలేలో ఫేమస్‌ డైలాగ్‌ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది.  

హరియాణాలో స్మూత్‌.. ‘మహా’ ఉత్కంఠ  
ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి.

శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది.  

సంకీర్ణ ధర్మం పాటించాలి
శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్‌ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్‌ పార్ట్‌నర్‌గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్‌ అయిన సీఎం ఫడ్నవిస్‌ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

1989లో శివసేన బీజేపీల తరఫున బాల్‌ ఠాక్రే, ఎల్‌కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్‌ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్‌(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్‌ అమిత్‌ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్‌ కొనసాగే అవకాశముంది.

రాముడు సత్యమే మాట్లాడేవాడు..
అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్‌– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్‌ డిమాండ్‌ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్‌ వ్యాఖ్యానించారు.  

గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు
బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్‌ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్‌ అధికారులు చెప్పారు. అక్టోబర్‌ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.

శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు!
ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలాసాహెబ్‌ వ్యాఖ్యానించారు.

సామ్నాలో బీజేపీపై విమర్శలు
సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి.  దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది.

మరిన్ని వార్తలు