ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

15 Nov, 2019 10:57 IST|Sakshi

కనీస ఉమ్మడి కార్యక్రమానికి  ఆమోదం

శివసేనకే ఐదేళ్లు సీఎం పీఠం

పదవుల పంపకాలపై వీడిన చిక్కుముడి

సాక్షి, ముంబై: రోజులుగా సాగుతున్న మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కనీస ఉమ్మడి కార్యక్రమానికి మూడు పార్టీల అధినేతలు అంగీకారం తెలిపారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పదవుల పంపకాలపై కూడా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్ర రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైన సీఎం పిఠాన్ని ఐదేళ్లపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ అంగీకరించాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్‌, ఎన్సీపీకి మండలి చైర్మన్‌ దక్కేలా నేతలు అంగీకారానికి వచ్చారు.

శివసేనకు సీఎంతో పాటు 14 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనికి మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, సోనియా గాంధీ అంగీకారం తెలిపారు. సీఎం పిఠాన్ని ఎన్సీపీ, శివసేనే చెరి రెండున్నరేళ్లు పంచుకుంటాయని తొలినుంచి ప్రచారం జరిగినా.. చివరికి శివసేనకు ఇచ్చేందుకు ఇరు పార్టీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ శుక్రవారం వివరాలను వెల్లడించినట్లు సమాచారం.

అనంతరం పార్టీ నేతలంతా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలుస్తారని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ఇదివరకే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న నేపథ్యంలో గవర్నర్‌ ఏ విధంగా స్పందిస్తారానేది ఆసక్తికరంగా మారింది. వీరికి అవకాశం ఇస్తారా? లేక రాష్ట్రపతి పాలనను కొనసాగిస్తారా అనేది శుక్రవారం సాయంత్రంలోపు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మహాశివ్‌ కూటమి ప్రభుత్వం ఈ 17వ తేదీన ఏర్పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు