ఉమ్మడి ముసాయిదా ఖరారు

15 Nov, 2019 03:25 IST|Sakshi
చర్చలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ నేతలు

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ అధ్యక్షుల సమ్మతే తరువాయి

ఆదివారం ప్రభుత్వం ప్రమాణస్వీకారం?

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు దిశగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై దాదాపు ఒక అంగీకారం కుదిరిందని, ఆదివారం నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గురువారం తొలిసారిగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు సమావేశమై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)తోపాటు అధికారంలో సమాన వాటా అంశంపై చర్చలు జరిపారు. ముసాయిదాను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లు ఉద్దవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్, సోనియా గాంధీలకు తుది నిర్ణయం కోసం అందించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మహాశివ్‌ కూటమి ప్రభుత్వం ఈ 17వ తేదీన ఏర్పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

సీఎంపీలో ఏముంటుంది?: కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)లో ఏ ఏ అంశాలున్నాయనే దానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యత అంశాలతోపాటు పదవుల పంపకంపై మూడు పార్టీల నేతల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరింది. ఒక అంచనా ప్రకారం..శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి పదవులతోపాటు చెరో 14 మంత్రి పదవులు.. అయిదేళ్లపాటు కాంగ్రెస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి, 11 మంత్రి పదవులు లభించనున్నట్టు తెలుస్తోంది. మరో అంచనా ప్రకారం.. శివసేన, కాంగ్రెస్‌లకు చెరో రెండేళ్లు, కాంగ్రెస్‌కు ఏడాది పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంపై అంగీకారం కుదిరిందని తెలిసింది. దీంతోపాటు మంత్రి పదవులు ఎన్సీపీ, శివసేనలకు సమానంగా ఉండగా కాంగ్రెస్‌కు మూడు మంత్రి పదవులు తక్కువ కానున్నాయని సమాచారం.

మరిన్ని వార్తలు