వారాంతంలో కొలువుతీరనున్న మహా సర్కార్‌..

21 Nov, 2019 14:33 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన సంకీర్ణ సర్కార్‌ ఈ వారాంతంలో కొలువు తీరే అవకాశం ఉంది. మూడు పార్టీల ప్రతినిధులు ఢిల్లీలో విస్తృత మంతనాలు కొనసాగిస్తున్న క్రమంలో కూటమి సర్కార్‌పై ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. మరోవైపు మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నుంచి తదుపరి సర్కార్‌కు మద్దతు ప్రకటిస్తూ రూపొందే లేఖలను శనివారం గవర్నర్‌కు సమర్పిస్తామని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ఇక సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్సీపీకి శివసేన సూచించింది. కాంగ్రెస్‌ నుంచి డిప్యూటీ సీఎం ఐదేళ్ల పాటు కొనసాగేలా సంప్రదింపులు సాగుతున్నాయి.

మరోవైపు కూటమికి తుదిరూపు ఇచ్చేందుకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల సంయుక్త సమావేశం ముంబైలో జరుగుతుందని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. అధికార పంపకంపై ప్రధానంగా చర్చలు జరిపే ఈ కీలక భేటీకి సేన, ఎన్సీపీల చీఫ్‌లు ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌లు హాజరవుతారు. అంతా సజావుగా సాగితే నూతన ప్రభుత్వం ఆదివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తుందని శివసేన వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించిన విషయం తెలిసిందే. మతతత్వ పోకడలపై పోరాడే క్రమంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు శివసేనకు మద్దతు ఇవ్వక తప్పడం లేదని సోనియా ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులకు వివరించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు