మా బలం 162

26 Nov, 2019 03:48 IST|Sakshi
తమ బలం చూపేందుకు శివసేన–కాంగ్రెస్‌–ఎన్సీపీలు ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్లో ఎమ్మెల్యేలను సమావేశపరచిన దృశ్యం

ముంబై హోటల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పరేడ్‌

హాజరైన మూడు పార్టీల సీనియర్‌ నేతలు

అజిత్‌ పవార్‌ విప్‌పై ఆందోళన వద్దు: ఎన్సీపీ ఎమ్మెల్యేలకు శరద్‌ భరోసా

సాక్షి, ముంబై: ముంబైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గ్రాండ్‌ హయత్‌ సోమవారం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి బలప్రదర్శనకు వేదికైంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చే రోజుకు ఒక రోజు ముందు.. సోమవారం సాయంత్రం మూడు పార్టీల ‘మహా వికాస్‌ అఘాడీ’ తమ ఎమ్మెల్యేలతో గ్రాండ్‌ హయత్‌ హోటల్లో పరేడ్‌ నిర్వహించింది. 162 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, ఇది గవర్నర్‌ కోశ్యారీ చూస్తున్నారనే భావిస్తున్నామని వ్యాఖ్యానించింది.

శివసేనకు చెందిన 56, ఎన్సీపీకి చెందిన 51, కాంగ్రెస్‌కు చెందిన 44, మిత్రపక్షాలు, ఇతరులు 11 మంది.. మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆసక్తి సృష్టించిన ఈ ‘మహా పరేడ్‌’లో శివసేన నేతలు ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్‌ రౌత్, ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ నుంచి ఆ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్, ఛగన్‌ భుజ్‌బల్, జయంత్‌ పాటిల్, సునీల్‌ తట్కరే, సుప్రియా సూలే, కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, అశోక్‌ చవాన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వారితో పాటు సమాజ్‌వాదీ నేత అబూ ఆజ్మీ, ‘స్వాభిమాని షెట్కారీ సంఘటన్‌’ చీఫ్‌ రాజు శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో ‘ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, తమ పార్టీ నేతల ఆదేశానుసారమే నడుచుకుంటామని’ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలు సైతం ప్రతిజ్ఞ చేశారు. పరేడ్‌ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు, ఈ మూడు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.  

సభ్యత్వంపై నాదీ భరోసా
ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ కనుక, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలంటూ ఆయన జారీ చేసే విప్‌ను ధిక్కరిస్తే శాసనసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందనే భయాలు అక్కర్లేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేల సభ్యత్వానికి తనదే బాధ్యత అని శరద్‌ పవార్‌ హామీ ఇచ్చారు. విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందంటూ తమ ఎమ్మెల్యేలను బీజేపీ భయాందోళనలకు గురి చేస్తోందని పవార్‌ విమర్శించారు.

‘రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించాను. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను పరిశీలించాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌ పవార్‌ను తొలగించాం. కాబట్టి, పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసే అధికారం తనకు లేదు. జారీ చేసినా ఆ విప్‌ చెల్లదు’ అని పవార్‌ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. ‘భయం, ఆందోళన వద్దు. మీ సభ్యత్వానికి నాదీ భరోసా. అక్రమంగా అధికారంలోకి వచ్చినవారిని గద్దె దింపాల్సిన సమయం వచ్చింది’ అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీపై శరద్‌ పవార్‌ నిప్పులు చెరిగారు. ‘అక్రమంగా, మెజారిటీ లేకున్నా అధికారంలోకి రావడానికి ఇది గోవా కాదు.. మహారాష్ట్ర. ఈ విషయం బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ.. ఇక్కడున్న 162 మంది ఎమ్మెల్యేలే కాదు.. తమ వెనుక ఇంకా ఎక్కువ మంది శాసన సభ్యులే ఉన్నారన్నారు. ‘కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం. బీజేపీని అడ్డుకునే దిశగా ఈ అవకాశం మాకు కల్పించిన మా పార్టీ చీఫ్‌ సోనియాకు కృతజ్ఞతలు’ అన్నారు.

నేరస్తుల్లా పరేడ్‌: బీజేపీ
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నిర్వహించిన బల ప్రదర్శనపై బీజేపీ మండిపడింది. నేరస్తుల తరహాలో పరేడ్‌ నిర్వహించి, దేశం ముందు మహారాష్ట్ర పరువు తీశారని బీజేపీ నేత ఆశిశ్‌ షెలార్‌ విమర్శించారు. పరేడ్‌లో 162 కాదు.. 145 మంది కూడా లేరని వ్యాఖ్యానించారు.  దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ల నేతృత్వంతో రాష్ట్రంలో అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. అయితే, ఈ పరేడ్‌కు 137 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని సమాచారం.
 

అడ్డు తొలగండి
– ఉద్ధవ్‌ ఠాక్రే
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డు తొలగాలని బీజేపీని ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. ‘మళ్లీ వస్తాను’ అనే ఫడ్నవీస్‌ ఎన్నికల ప్రచార నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘మేం ఆల్‌రెడీ వచ్చేశాం’ అని ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. అధికారం కోసం బీజేపీ అత్యంత హేయంగా వ్యవహరిస్తోందన్నారు.


మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సంబంధించిన చెక్కుపై తొలి సంతకం చేస్తున్న ఫడ్నవీస్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా