ఉద్ధవ్‌ అసంతృప్తి.. ఏం జరుగుతుందో!?

16 Sep, 2019 11:17 IST|Sakshi

సీట్ల పంపకాలలో బీజేపీతో కుదరని ఏకాభిప్రాయం

ముంబై: రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తు కుదురుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీజేపీతో పొత్తుకు శివసేన సిద్ధంగానే ఉంది. ఈ రెండు హిందుత్వ పార్టీలు కలిసి పోటీచేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే, సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉండాలని శివసేన శ్రేణులకు అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సూచించినట్టు తెలుస్తోంది. ఆదివారం మాతేశ్రీలో శివసేన నేతలతో భేటీ అయిన ఉద్దవ్‌.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నట్టు సమాచారం.

నిజానికి శివసేన ఒంటరిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. బీజేపీతో కలిసి పోటీచేస్తేనే రాజకీయంగా లాభం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, పొత్తులో భాగంగా తమకు కేటాయించే సీట్లు తగ్గిస్తే మాత్రం ఒప్పుకునేది లేదని శివసేన కృతనిశ్చయంతో ఉంది. బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన మొదట 140 సీట్లు డిమాండ్‌ చేసింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని సీట్లు ఇవ్వలేమని బీజేపీ చెప్పడంతో ఆ సంఖ్యను 120కి తగ్గించింది. అయితే, బీజేపీ అధినాయకత్వం మాత్రం శివసేనకు 106 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. అంతకుమించి ఇవ్వలేని, ఇతర ఎన్డీయేలోని చిన్న పార్టీలకు సీట్లు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత తనపైన ఉందని బీజేపీ అంటోంది. మరీ అంత తక్కువ సీట్లు అయితే, పొత్తుకు దూరంగా ఉండి ఒంటరిగా పోటీ చేయాలని ఉద్ధవ్‌ భావిస్తున్నారని, అంతేకాకుండా ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సీఎం పదవిని కూడా అడగాలని ఆయన భావిస్తున్నారని శివసేన వర్గాలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో సీట్ల పంపకాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బీజేపీ-శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్‌41, ఎన్సీపీ 42 సీట్లను గెలుపొందింది. అనంతరం బీజేపీ-శివసేన పొత్తు కుదుర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా