బీజేపీపై శివసేన ఆగ్రహం

25 Jun, 2019 14:51 IST|Sakshi

మహారాష్ట్రలో బీజేపీ రథయాత్ర

అభ్యంతరం వ్యక్తం చేసిన శివసేన

సాక్షి, ముంబై: అధికార బీజేపీపై దాని మిత్రపక్షం శివసేన మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గడిచిన నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, వాటి నివారణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలపాలని డిమాండ్‌ చేసింది. రైతుల ఆత్మహత్యలు, మరాఠా రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే సరైన నిర్ణయం తీసుకోవాలని శివసేన కోరింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్‌ను ప్రచురించింది. కాగా గడిచిన ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రథయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.

యాత్రపై శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతాంగ సమస్యలను పరిష్కరించిన తరువాతే యాత్రను చేపట్టాలిన పేర్కొంది. రైతులకు ఏం చేశారని ప్రభుత్వ విజయంగా భావిస్తారని శివసేన ప్రశ్నించింది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విమర్శించింది. అయోధ్యలో రామమందిర ఏర్పాటును కోరుతూ.. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేపట్టిన రథయాత్రకు 25 ఏళ్లు పూర్తి అయినట్లు సామ్నా గుర్తుచేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆలయ నిర్మాణంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయిందని అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన రథయాత్రపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్లు శివసేన పేర్కొంది.

మరిన్ని వార్తలు