ప్రజలు చనిపోతారేమో కానీ మోదీకేం కాదు

11 Jun, 2018 10:36 IST|Sakshi
నరేంద్ర మోదీ, ఉద్దవ్ థాక్రే (ఫైల్‌ఫొటో)

ముంబై : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆరెస్సెస్‌ ప్రకటించే అవకాశముందని పేర్కొన్న మరుసటి రోజే శివసేన ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు సంబంధించిన లేఖపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రధాని మోదీ హత్యకు భారీ కుట్ర జరుగుతోందని, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని పుణే పోలీసులు ఓ లేఖను బయట పెట్టిన విషయం తెలిసింది. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఈ లేఖపై శివసేన తమ అధికారిక పత్రిక సామ్నాలో సెటైరిక్‌గా స్పందించింది. ఇది చాలా ఆసక్తికరంగా.. ప్రమాదకరంగా ఉందని, కానీ ప్రజలు చనిపోతారేమో కానీ.. మోదీకి ఏం కాదని పేర్కొంది.

ఇటీవల ఈ లేఖపై ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ సైతం స్పందించారు.  బీజేపీ తన పట్టు కోల్పోతుందని గ్రహించి ఈ కుట్రకు తెరలేపిందని ఆయన విమర్శించారు. దీన్ని గ్రహించలేని స్థితిలో ప్రజలు లేరన్నారు. ఇలాంటి లేఖలు మీడియా వద్దకు కాకుండా భద్రతా ఎజెన్సీలకు ఎలా చేరుతాయని ప్రశ్నించారు. ఇది బీజేపీ నాయకుల డ్రామా అని విమర్శించారు.

మరిన్ని వార్తలు