‘రాష్ట్రపతి పాలన ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు’

16 Nov, 2019 15:12 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న శివసేన మాజీ మిత్రపక్షం బీజేపీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు రాయబేరాలు సాగిస్తోందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. 105 మంది ఎమ్మెల్యేలతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు స్పష్టం చేసిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో తమ పార్టీ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని ఎలా చెప్పగలుగుతుందని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి దారిలోకి తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టింది. బీజేపీ చెబుతున్న పారదర్శక ప్రభుత్వం ఏంటో ఇప్పుడు వెల్లడవుతోందని శివసేన విమర్శించింది. అనైతిక పద్ధతుల్లో ఎమ్మెల్యేలను లోబరుచుకోవడం మహారాష్ట్ర సంప్రదాయం కాదని హితవు పలికింది.

​కాగా తమ పార్టీ త్వరలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ సామ్నా సంపాదకీయం బీజేపీని ఎండగట్టింది. ఇక రాజకీయాలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ క్రికెట్‌తో పోల్చడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయాలు ఆటల కన్నా ఇప్పుడు వ్యాపారంలా మారాయని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. క్రికెట్‌లోనూ రాయబేరాలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉందని గుర్తెరగాలని పేర్కొంది. మహారాష్ట్రలో గడువులోగా ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకురాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా