‘ఆ వైరస్‌ మాకు సోకదు’

11 Mar, 2020 13:36 IST|Sakshi

ముంబై : మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ల మధ్య మెరుగైన సమన్వయం కొనసాగుతోందని అన్నారు. మధ్యప్రదేశ్‌ వైరస్‌ మహారాష్ట్ర సర్కార్‌కు సోకదని వ్యాఖ్యానించారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడటం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. బీజేపీ దీన్ని తన ప్రయోజనాలకు వాడుకోవడం తగదని చెప్పుకొచ్చారు.

సింధియా సేవలను కాంగ్రెస్‌ సరిగ్గా వాడుకోనందునే చివరికి అది ఆయన నిష్ర్కమణకు దారితీసిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మధ్యప్రదేశ్‌ వైరస్‌ ప్రవేశించదని, మూడు నెలల కిందట నిర్వహించిన ఆపరేషన్‌ లోటస్‌ విఫలమైందని గుర్తుచేశారు. మహా వికాస్‌ అగడి బైపాస్‌ సర్జరీ చేసి మహారాష్ట్రను కాపాడిందన్నారు. సింధియాకు మద్దతుగా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సర్కార్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. మరోవైపు ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కూల్చివేయాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

చదవండి : బానిస మనస్తత్వానికి సూచిక

మరిన్ని వార్తలు