మారిన బెర్త్‌.. ఇంత అవమానమా?

20 Nov, 2019 16:25 IST|Sakshi

రాజ్యసభలో తన సీటును మార్చడంపై శివసేన ఆగ్రహం

ముంబై: మిత్రపక్షం బీజేపీకి కటీఫ్‌ చెప్పిన శివసేనకు మరో ఝలక్‌.. రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కూర్చునే సీటును మార్చేశారు. ఇప్పటివరకు పెద్దలసభలో మూడో వరుసలోని సీటులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూర్చునేవారు. కానీ ఆయన సీటును ఇప్పుడు ఐదో వరుసలోని కూర్చీలోకి మార్చారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధంతరంగా తన సీటును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడికి ఆయన లేఖ రాశారు. రాజ్యసభలో తన సీటు మార్చడం తీవ్ర ఆశ్చర్యం కలిగించిందని, శివసేన మనోభావాలను దెబ్బతీయడానికి, తమ పార్టీ గొంతును అణచివేయడానికే ఉద్దేశపూరితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. తనను, శివసేనను అవమానించడానికే ఇలా సీటు వరుసను మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నట్టు తాము ఇంకా అధికారిక ప్రకటన చేయలేదని, అయినప్పటికీ సీటు వరుసను ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు.  

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ-శివసేన తమ మధ్య దోస్తీకి కటీఫ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి పంపకం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బీజేపీకి దూరం జరిగిన శివసేన కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో ఇటు కాంగ్రెస్‌, ఎన్సీపీతోనూ ఇంకా ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంతోపాటు ఆ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు