ఆమెకు ఒక్క గంట చాలు

29 Jul, 2018 09:16 IST|Sakshi

సాక్షి, ముంబై: మరాఠా రిజర్వేషన్‌ బిల్లు వ్యవహారంపై శివసేన మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. మంత్రి పంకజ ముండే(39) వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై విరుచుకుపడింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. (మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?)

‘ఎలాంటి సమస్యలు లేకుండా మరాఠా రిజర్వేషన్‌ బిల్లును క్లియర్‌ చేస్తానని పంకజ ముండే చెబుతున్నారు. ఆమెను ఒక్క గంట ముఖ్యమంత్రిని చేయండి చాలు. రిజర్వేషన్‌ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది’ అని ఆ సంపాదకీయం పేర్కొంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లను ఏకీ పడేసింది. ఓ మహిళా మంత్రి, రిజర్వేషన్‌ బిల్లుపై ఆసక్తి చూపుతుంటే.. సీఎం మాత్రం కిక్కురు మనకుండా ఉండిపోతున్నారు. కనీసం ఢిల్లీ వెళ్లి ప్రధానినో లేక.. మంత్రులనో కలిసి మరాఠా బిల్లు కోసం చర్చించాలన్న ఇంగిత జ్ఞానం సీఎంకు లేకుండా పోయింది. ఒకవేళ ధైర్యం చేసి ఢిల్లీ వెళ్లినా సమయానికి ఆ ప్రధాని ఉండరు. ఎప్పుడూ చూసినా విదేశాలు పట్టుకుని తిరుగుతుంటారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను అణచివేయటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ప్రభుత్వాలు పని చేస్తున్నాయి అని సామ్నాలో శివసేన విమర్శలు గుప్పించింది. 

ఇదిలా ఉంటే 16 శాతం రిజర్వేషన్‌ కోరుతూ మరాఠా కమ్యూనిటీ(మొత్తం 30 శాతం జనాభా ఉంది) ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం విదితమే. ఆందోళనల్లో భాగంగా జూలై 23న ఔరంగాబాద్‌లో ఓ యువకుడు(27) గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మక రూపం దాల్చింది. గురువారం బీద్‌ జిల్లా పర్లీలో పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పంకజ ముండేను మరాఠా ఉద్యమకారులు అడ్డుకున్నారు. ‘మరాఠా రిజర్వేషన్‌ ఫైల్‌ నా టేబుల్‌పై గనుక ఉండి ఉంటే నిమిషాల్లో సంతకం పెట్టేదాన్ని. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందుకే జాప్యం’ అని ఆమె వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు