‘మోదీజీ.. వ్యక్తిగత దాడులు ఆపండి’

10 May, 2018 09:14 IST|Sakshi
శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, ముంబై : దేశ ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ చేసిన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టడం పట్ల శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి పార్టీ తన అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని, 2019లో రాహుల్‌ ప్రధాని కాగోరితే 2014లో బీజేపీని ఎన్నుకున్న తరహాలో ప్రజలే ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే నాయకులను ఇలా కించపరచడం సరైంది కాదని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. పార్టీలో సీనియర్‌ నేతలు, భాగస్వామ్య పక్షాలను పక్కనపెట్టి రాహుల్‌ ప్రధాని రేస్‌లోకి వచ్చారన్న మోదీ వ్యాఖ్యలపైనా ఆయన మండిపడ్డారు.

ప్రతిపార్టీలోనూ అత్యున్నత పదవికి నేతలు క్యూలో ఉంటారని, గతంలో ప్రధాని పదవిపై ప్రణబ్‌ ముఖర్జీ ఆసక్తి చూపినా మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయ్యారని, ఇక బీజేపీలో మురళీ మనోహర్‌ జోషీ, ఎల్‌కే అద్వానీలు క్యూలో ఉన్నా పార్టీ ప్రధానిగా నరేంద్ర మోదీ వైపు మొగ్గుచూపిందని అన్నారు. వ్యక్తిగత దాడులు చేసేందుకు ప్రధాని దూరంగా ఉండాలని రౌత్‌ హితవు పలికారు. మరోవైపు రాహుల్‌ 2019లో ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమని చేసిన ప్రకటనపై ఎన్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఏ పాత్ర నిర్వర్తిస్తారనేది చెప్పడం ఇప్పుడు తొందరపాటే అవుతుందని ఆ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు.

మరిన్ని వార్తలు