‘ఎన్‌సీపీని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు’

4 Dec, 2019 16:18 IST|Sakshi

ముంబై: ఎన్‌సీపీని ప్రలోభపెట్టడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ బుధవారం శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కవద్దనే అక్కసుతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌తో కలిసి పనిచేద్దామంటూ వివాదం సృష్టించే ప్రయత్నం చేశారంటూ మండిపడింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్‌పవార్‌ను మహారాష్టకు ఏం చేశావంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించడాన్ని సామ్నా గుర్తు చేసింది. అమిత్‌ షా వ్యాఖ్యలపై పవార్‌ దీటుగా స్పందించారని తెలిపింది.

శరద్‌ పవార్‌ ఓ మరాఠా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మోదీ, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి బయటపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పవార్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలు, అభివృద్ధి పరంగా తాను మోదీని సమర్థిస్తానని చెప్పుకొచ్చారు. తాము వ్యక్తిగతంగా మంచి స్నేహితులమని కానీ.. పార్టీ సిద్దాంతాల పరంగా బీజేపీలో చేరబోనని పవార్‌ స్పష్టం చేశారు.

కాగా, కొద్దికాలంగా మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన సంగతి తెలిసిందే. మహా వికాస్‌ ఆఘాడి తరఫున శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మహా హైడ్రామాకు తెరపడింది. అనంతరం జరిగిన బల పరీక్షలో ఉద్ధవ్‌ ఠాక్రే తన మెజారిటీని నిరూపించుకున్నారు.

మరిన్ని వార్తలు