అన్ని కాలాలకు వర్తించేదే మార్క్సిజం

22 Feb, 2020 02:17 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కవి శివారెడ్డి. చిత్రంలో విమలక్క, చాడ, సురవరం, తమ్మినేని తదితరులు

సుందరయ్య విజ్ఞానకేంద్రం : మార్క్సిజానికి కాలపరిమితి లేదనీ, అన్ని కాలాలకు వర్తించేదే ఆ సిద్ధాంతమని దీన్ని మన సమాజానికి వర్తింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవి, విమర్శకుడు కె.శివారెడ్డి అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్, నవచేతన బుక్‌హౌస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రచయిత కె.గాంధీ రాసిన తెలుగు అనువాదం ‘మార్క్స్, ఏంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, కమ్యూనిజం సూత్రాలు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ లోని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయి అవి బలహీన పడ్డాయన్నారు.

పురోగమన శక్తుల నుంచే గొప్ప కవిత్వం వస్తుందని చెప్పారు.సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైద్ధాంతిక అధ్యయనంతో వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని, ఐక్య ఉద్యమాల ద్వారానే దోపిడీ శక్తులను తిప్పికొట్టాలన్నారు. పెట్టుబడిదారీ సమాజం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఘర్షణలు, యుద్ధాల ద్వారా వైవిధ్యాన్ని, సంక్షోభాన్ని పేద దేశాలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయ ని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్ట్‌ దాడులను తిప్పికొట్టడానికి కమ్యూనిస్టులంతా ఐక్యంగా పని చేయాలని చెప్పారు.

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ పార్టీలు దేశ ఆర్థిక పరిస్థితులను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారని, అందుకే భిన్నమైన రీతుల్లో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సాయుధ పోరాటయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, తెలం గాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ గౌస్, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ మేనేజర్‌ కోయ చంద్రమోహన్, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రతినిధి మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు