వాజ్‌పేయి మలిచిన ఉత్తమ నేత చౌహాన్‌

13 Dec, 2018 02:41 IST|Sakshi

ఓటమిని హుందాగా అంగీకరించిన వైనం

‘గెలుపైనా.. ఓటమైనా... నేను భయపడను.కర్తవ్య నిర్వహణ పథంలో ఏది ఎదురయినా దాన్ని స్వీకరిస్తాను’ సీఎం పదవికి రాజీనామా చేసే ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలు 2018 ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్న మాటలివి. శివ మంగళ్‌ సింగ్‌ అనే కవి రాసిన కవితలోని పంక్తులివి. గత పదిహేనేళ్లుగా అనుభవిస్తున్న ముఖ్యమంత్రిత్వం చేజారిపోయిందన్న బాధ ఆయనలో కనిపించడం లేదు. తన కుర్చీని లాక్కున్న ప్రతిపక్షంపై ఆగ్రహమూ వ్యక్తం చేయ లేదు.ఓటమికి సాకులు వెతకలేదు. స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంత చిత్తంతో పదవి నుంచి హుందాగా తప్పుకున్న చౌహాన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తానే వహిస్తున్నట్టు చెప్పారు. అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. ఒక కుటుంబ సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్నదే తన కోరికన్నారు. తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని కూడా కోరారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు ట్రై చేద్దాం
తాజా ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఏ పార్టీకీ కూడా సంపూర్ణ మెజారిటీ రాని నేపథ్యంలో.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరుదామని బీజేపీ అధినాయకత్వం చౌహాన్‌కు సూచించింది. అయితే, ప్రజలు మనకు మెజారిటీ ఇవ్వలేదు, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కులేదు అన్ని స్పష్టంగా చెప్పడం చౌహాన్‌ నిజాయితీకి నిదర్శనం. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన తర్వాత ఇప్పుడు నేను హాయిగా ఉన్నానని విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

‘నా రాజీనామాను గౌరవనీయ గవర్నర్‌కు అందజేశాను. ఈ ఓటమి బాధ్యత పూర్తిగా నాదే. కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ను అభినందిస్తున్నాను’ అన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఓటు వేసినందుకు ఓటర్లకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు కూడా చెప్పారు. ‘మీరు చూపించిన అపరిమిత ఆప్యాయత, విశ్వాసాలను, మీ దీవెనలను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన 59 ఏళ్ల చౌహాన్‌ను రాష్ట్ర ప్రజలు అభిమానంతో మామ అని పిలుచుకుంటారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతితో నిండిన ప్రస్తుత రాజకీయాల్లో ఉంటూ కూడా ఆ అవలక్షణాలు ఏమాత్రం అంటని సచ్చీలుడు చౌహాన్‌. 

చౌహాన్‌కు అభినందనల ట్వీట్లు
ప్రజల ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించారు. ప్రజాభీష్టం ఏమిటో తెలిసి ప్రశాంతంగా అధికార మార్పిడికి సిద్దపడ్డారు.    
-సాగరిక ఘోష్, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

మధ్య ప్రదేశ్‌ ప్రజల తీర్పును గౌరవిస్తూ కర్ణాటకలోలా బేరసారాలకు దిగకుండా హుందాగా తప్పుకోవడం ద్వారా చౌహాన్‌జీ మన అత్యంత హుందాగల రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిరూపించుకున్నారు. వాజ్‌పేయి మలిచిన బీజేపీ నాయకుడాయన. 
-శేఖర్‌ గుప్తా, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలుసుకున్నప్పుడు ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ చౌహాన్‌జీని ఎంతగానో ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో హుందాగా, సౌమ్యంగా మాట్లాడతారని, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు. మన్మోహన్‌జీ మాటలు నిజమేనని చౌహాన్‌ ఈ రోజు నిరూపించారు. 
-అల్కా లాంబ, ఢిల్లీ ఎమ్మెల్యే (ఆమ్‌ ఆద్మీ పార్టీ)

మరిన్ని వార్తలు