సమాజ్‌వాది చీలిక వెనక అమిత్‌ షా!

30 Aug, 2018 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహా కూటమి ఆవిర్భవించక ముందే సమాజ్‌వాది పార్టీలో చీలిక రావడం విచారకర పరిణామమే. పార్టీ వ్యవస్థాపక నాయకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్, తన అన్న కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ ‘సమాజ్‌వాది సెక్యులర్‌ ఫ్రంట్‌’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించారు. చీలికవైపు శివపాల్‌ యాదవ్‌ను ప్రోత్సహించిందీ తెరముందు నుంచి అమర్‌ సింగ్‌ అయితే, తెరవెనక నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అని నిస్సందేహంగా చెప్పవచ్చు!

ఎందుకంటే శివపాల్‌ యాదవ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి 24 గంటల ముందే అమర్‌ సింగ్‌ లక్నోలో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతో బీజీపీ పార్టీలో శివపాల్‌ యాదవ్‌కు సముచిత స్థానం కల్పించడం కోసం ఆ పార్టీ అధినాయకులతో మాట్లాడానని, అయితే చివరి నిమిషంలో శివపాల్‌ తన మనసు మార్చుకున్నారని చెప్పారు. శివపాల్‌ యాదవ్‌కు, అమర్‌ సింగ్‌కు మధ్యన మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. శివపాల్‌ కారణంగానే అమర్‌ సింగ్‌ రెండోసారి సమాజ్‌వాది పార్టీలోకి వచ్చారు. శివపాల్‌ యాదవ్‌ బీజేపీలో చేరడానికి బదులు సమాజ్‌వాది పార్టీని ఏర్పాటు చేశారంటే ఇందులో ప్రముఖ వ్యూహకర్తగా పేరు పొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా హస్తం ఉండే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

శివపాల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి బదులు కొత్త పార్టీని ఆయనతో పెట్టిస్తే రానున్న ఎన్నికల్లో అఖిలేష్‌ పార్టీని దెబ్బతీయవచ్చని, తద్వారా ఎస్పీ–బీఎస్పీ కూటమి విజయావకాశాలను అడ్డుకోవచ్చని అమిత్‌ షా ఆలోచించి ఉంటారు. యూపీలోని రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ పార్టీలు కలసి పోటీ చేయడం వల్ల ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా ఐదు సార్లు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విజయోత్సాహంతో 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఐక్యంగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు నిర్ణయించుకోవడంతోపాటు కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలను కలుపుకొని మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నాయి.

ఈలోగా శివపాల్‌ యాదవ్‌ రూపంలో పార్టీలో చీలిక రానుంది. పార్టీలో ఎంతో కాలం సీనియర్‌ నాయకుడిగా చెలామణి అయిన శివపాల్‌ యాదవ్‌కు పార్టీలో పలుకుబడి బాగానే ఉంది. అందుకనే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసిన శివపాల్‌ యాదవ్‌కే అఖిలేష్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మద్దతు ఇచ్చారు. పార్టీలో భిన్న శిబిరాలు ఏర్పడిన కారణంగా నాటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని గ్రహించిన పార్టీలోని శిబిరాలు ఎన్నికల అనంతరం కనీసం బయటకు ఐక్యంగానే ఉంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో శివపాల్‌ తిరుగుబాటు జెండా ఎగురవేశారు.

‘గత ఏడాది కాలంగా అఖిలేష్‌ యాదవ్‌లో మార్పు వస్తుందని ఎదురు చూశాను. ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పార్టీ సీనియర్‌ నాయకులను నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. నాతో పాటు చాలా మంది సీనియర్‌ నాయకులు అలాగే ఫీలవుతున్నారు. నేను ఇక లాభం లేదనుకొని ఇప్పుడు బయటకు వచ్చాను. మిగతా వారు కూడా వస్తారు’ అని శివపాల్‌ యాదవ్‌ తెలిపారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తనకు తన అన్న ములాయం సింగ్‌ యాదవ్‌ దీవెనలు ఉన్నాయని అయన చెప్పారు. ఆయన దీవెనలు ఉన్నా లేకపోయినా, ఆయన పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరుతారనడంలో సందేహం లేదు. అందుకే అమిత్‌ షా, పార్టీలో చేరడానికి తన వద్దకు ప్రతిపాదన తీసుకొచ్చిన శివపాల్‌ యాదవ్‌కు ఏదో విధంగా నచ్చచెప్పి కొత్త పార్టీ ఏర్పాటుకు పురిగొల్పి ఉంటారు.

>
మరిన్ని వార్తలు