మధ్యప్రదేశ్‌ సీఎంగా చౌహాన్‌

24 Mar, 2020 01:44 IST|Sakshi
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

రాత్రి రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆయనతో సోమవారం రాత్రి 9 గంటలకు రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలెవరూ హాజరు కాలేదు. మధ్యప్రదేశ్‌లో నాలుగో సారి సీఎం పదవి స్వీకరించిన వ్యక్తిగా చౌహాన్‌ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు.  

శాసనసభాపక్ష నేతగా..
సోమవారం సాయంత్రం చౌహాన్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీనియర్‌ బీజేపీ నేత గోపాల్‌భార్గవ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించగా మరి కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను బలపరిచారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌.. చౌహాన్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగాప్రకటించారు. అనంతరం చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు విక్టరీ గుర్తును చూపిస్తూ కనిపించారు. కేవలం చౌహాన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో వచ్చే వారంలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.  

107 మంది ఎమ్మెల్యేలతో..
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటంతో, ఆయన వెంట ఉన్న 22 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేకపోయింది. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే మిగిలింది. 230 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించగా, 22 మంది రాజీనామా చేశారు. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్‌ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. 

మరిన్ని వార్తలు