ప్రచారంలో చినబాబుకు చుక్కలు

18 Mar, 2019 04:21 IST|Sakshi
వీర్లపాలెం గ్రామంలో సమస్యలపై లోకేష్‌ను నిలదీస్తున్న డ్వాక్రా మహిళలు

రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ నిలదీసిన పెదకొండూరు రైతులు

పసుపు–కుంకుమ చెక్‌లు జమ చేసుకుంటున్నారన్న వీర్లపాలెం మహిళలు

దుగ్గిరాల (మంగళగిరి): దొడ్డిదారిన మంత్రి అయ్యి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన నారా లోకేష్‌కు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల ప్రసంగాల్లో మధ్యలో అడ్డుతగిలి నిలదీస్తుండటంతో ఏం చెప్పాలో తెలియక లోకేష్‌ బిక్కమొహం వేస్తున్నాడు. టీడీపీ మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి అయిన నారా లోకేష్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం దుగ్గిరాల మండలంలో పర్యటించారు. పెదకొండూరు గ్రామంలో ప్రచారానికి వచ్చిన లోకేష్‌ను గ్రామస్తులు సమస్యలపై నిలదీశారు. లోకేష్‌ ప్రసంగిస్తుండగా మధ్యలో రైతులు వారించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేశామని చెప్పడంతో రైతులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కొందరు రైతులు కలుగజేసుకుని కరెంటు సమస్యలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ విద్యుత్‌ కొరత లేకుండా చేశారో చెప్పాలని నిలదీశారు.

పెదకొండూరు గ్రామంలో లోకేష్‌ను నిలదీస్తున్న రైతులు 

అనేకసార్లు విద్యుత్‌ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరించలేదని వాపోయారు. మొక్కజొన్న బోనస్‌ చెల్లిస్తామని చెప్పారని, నేటికీ బోనస్‌ జమ కాలేదని,  రైతుమిత్ర గ్రూపులకు రుణమాఫీ జరగలేదని, బ్యాంకు నోటీసులు పంపించారంటూ రైతులు చినబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని ఒక్కసారి ఓటు వేసి తనను శాసనసభకు పంపించాలంటూ లోకేష్‌ ముందుకు సాగారు. వీర్లపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీ మహిళలు పసుపు కుంకుమ కింద అందజేసిన చెక్కులు మారడం లేదని, మారిన చెక్కులను పాత బకాయిల కింద బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారంటూ లోకేష్‌కు మొరపెట్టుకున్నారు. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన లోకేష్‌ అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తానంటూ అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. మండలంలోని పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం, పెదపాలెం, చినపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు.

మరిన్ని వార్తలు