జగన్‌ను గెలిపించండి

26 Feb, 2019 03:05 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పవన్‌కు సూచిస్తున్న రైతు ఎల్లప్ప

పవన్‌కళ్యాణ్‌ ముఖాముఖిలో రైతు ఎల్లప్ప

ప్రతిపక్ష నేతను గెలిపించాలని సభాముఖంగా పిలుపు

అప్పుడే కష్టాలన్నీ తీరతాయన్న అన్నదాత

రైతు పిలుపుతో నివ్వెరపోయిన జనసేన అధినేత 

ఆదోని: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రానికి చెందిన రైతు ఎల్లప్ప జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను కోరారు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తే కష్టాలు తీరతాయన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పవన్‌ రెండో రోజు సోమవారం కర్నూలులోని ఓ ఫంక్షన్‌ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జగన్నాథగట్టులోని పక్కా గృహాలను పరిశీలించారు. ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్‌ షో చేశారు. సాయంత్రం ఆదోని పట్టణంలో రోడ్డు షో నిర్వహించాక స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం దయనీయంగా మారిందని, గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నారని చెప్పారు. తాను రైతుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన కూడా న్యాయం కోసం పోరాడతానని చెప్పారు. 

కష్టాల్లో ఉన్నాం.. జగన్‌ను గెలిపించాలి
వ్యవసాయంలో కష్టనష్టాలపై మాట్లాడాలని పవన్‌ రైతులను కోరగా దేవనకొండ మండల కేంద్రానికి చెందిన రైతు ఎల్లప్ప వేదికపైకి వెళ్లారు. తాను పడుతున్న కష్టాలను, తన ఆకాంక్షను పవన్‌ ముందుంచారు. ‘ఇప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. వానల్లేవ్‌.. పశువులే మాకు ప్రపంచం. వాటినీ అమ్ముకుంటిమి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలి’ అంటూ ఉద్వేగంతో మాట్లాడారు. రైతు ఆకాంక్షను విన్న పవన్‌కు నోట మాట రాలేదు. తన వెంట ఉన్న పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ చెయ్యి గిల్లారు. దీంతో ఆయన పక్కకు రమ్మంటూ రైతును పిలిచి మైకు తీసుకుని.. మరో రైతును మాట్లాడేందుకు పిలిచారు. మరో రైతు మాట్లాడుతుండగానే అభిమానులు బారికేడ్లను నేలమట్టం చేసి.. వేదిక వద్దకు తోసుకొచ్చారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అభిమానులు వేదికను చుట్టుముట్టి పైకి ఎక్కేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. కుర్చీలు విరిగాయి. దీంతో పవన్‌కళ్యాణ్‌ కార్యక్రమాన్ని అర్థంతరంగా ఆపేసి వెళ్లిపోయారు. 

వేదిక వద్ద విరిగిన బారికేడ్లు, కుర్చీలు 

మరిన్ని వార్తలు