విశాఖలో టీడీపీకి షాక్‌

2 Sep, 2019 04:39 IST|Sakshi
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశాఖ డెయిరీ సీఈవో ఆడారి ఆనంద్‌ కుమార్, డెయిరీ డైరెక్టర్‌ పిల్లా రమాకుమారి. చిత్రంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన విశాఖ డెయిరీ సీఈవో, డైరెక్టర్లు 

యలమంచిలి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కూడా

సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు.  విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనంద్‌ కుమార్, డెయిరీ డైరెక్టర్‌ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌), డెయిరీ ఇతర డైరెక్టర్లు రెడ్డి రామకృష్ణ, మలసాల వెంకటరమణ, శీరంరెడ్డి సూర్యనారాయణ, అరంగి రమణబాబు, ఎస్‌. సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, గేదెల సత్యనారాయణ, సేనాపతి గౌరీ భీమ శంకరరావు, దాడి గంగరాజు, చిటికెల రాజకుమారి, సుందరపు ఈశ్వర పరదేశ్‌ గంగాధర్, శరగడం వరహ వెంకట శంకరరావు ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం తన క్యాంపు కార్యాలయంలో వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరి చేరికతో టీడీపీకి  గట్టి దెబ్బ తగిలినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ దొండా కన్నాబాబు, సెంట్రల్‌ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ పినపోలు వెంకటేశ్వరరావు, జిల్లా కాపు సంఘం నాయకులు కాజ వెంకటఅప్పారావు, యలమంచిలి మాజీ ఎంపీపీ ఆడారి శ్రీధర్, ఆర్‌.ఈ.సి.ఎస్‌. మాజీ అధ్యక్షుడు బి.ప్రసాద్, సీనియర్‌ నేత బొడ్డేడ ప్రసాద్, మునగపాక మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

పథకాలు ప్రజలకు అందేలా చూడండి: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని,  ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారు. త్వరలో ఏర్పాటవుతున్న గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల పట్ల పాలకుల్లా కాకుండా సేవకుల్లా ఉండాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, అదీప్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

త్వరలో వైఎస్సార్‌సీపీలోకి ఆసక్తికర చేరికలు:  విజయసాయిరెడ్డి 
వైఎస్సార్‌ సీపీలోకి త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలు పార్టీలో చేరిన సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు తీరు మార్చుకోలేదని, దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా