ఆదివాసీ అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలి

18 Sep, 2018 03:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న బాపూరావ్‌

ఆదివాసీ ఉద్యమ నేత సోయం బాపూరావు

ఉట్నూర్‌/ఇంద్రవెల్లి (ఖానాపూర్‌): ‘రాష్ట్రంలో త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివాసీ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలి. లేదంటే తుడుందెబ్బ తరఫున ఆదివాసీ అభ్యర్థులను బరిలో నిలుపుతాం. కేసీఆర్‌కు ఆదివాసీల సత్తా ఏమిటో తెలిసి వచ్చేలా చేస్తాం’ అంటూ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ ఉద్యమ నాయకుడు సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏటీడబ్ల్యూఏసీ మాజీ చైర్మన్‌ సిడాం భీంరావ్‌ అధ్యక్షతన సోమవారం ఆదివాసీల ఐక్యత సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పోరాటం చేస్తుండగా.. కేసీఆర్‌ లంబాడీలకు టికెట్లు కేటాయించి తమ మనోభావాలు దెబ్బ తీశారన్నారు. ఆదివాసీలంతా ఏకమై ‘లంబాడీ హఠావో.. ఆదివాసీ బచావో’ నినాదంతో ఆదివాసీ అభ్యర్థులను గెలుపించుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించకుంటే తగిన మూల్యం చెల్లించేలా చేస్తామని హెచ్చరించారు. ఎస్టీ రిజర్వు స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే లంబాడీ వర్గానికి చెందిన వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ తొమ్మిది తెగల పెద్దలంతా కలసి ఎస్టీ రిజర్వు స్థానాల్లో ఆదివాసీల నుంచి ఒక్కరినే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలుపడం ద్వారా ఎలాంటి విభేదాలు రావన్నారు.

ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి 17 మంది ఆది వాసీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. పోటీలో ఉండే రాథోడ్‌ రమేశ్, రేఖానాయక్‌ల డిపాజిట్లు గల్లంతయ్యేలా ఆదివాసీల తడాఖా చూపుదామన్నా రు. లంబాడీ అభ్యర్థులు ఓట్ల కోసం ఆదివాసీ గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలని అన్నారు. అనంతరం ఆదివాసీ పెద్దలు నిర్ణయించిన అభ్యర్థికి పోటీలో మరో ఆదివాసీ అభ్యర్థి పోటీ చేయకుండా తీర్మానం చేశారు. సమావేశంలో మహారాష్ట్ర ప్రొఫెసర్‌ ఉయికే హంరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు