అసెంబ్లీ సాక్షిగా సీఎం వర్సెస్‌ గవర్నర్‌!

27 Nov, 2019 09:19 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధాంకర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. మమత సర్కార్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందంటూ గవర్నర్‌ ధాంకర్‌ విమర్శలు గుప్పిస్తుండగా.. గవర్నరే సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారని మమత దీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 70వ వార్షికోత్సవం సందర్భంగా బెంగాల్‌ అసెంబ్లీలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య ఘర్షణకు వేదికగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తనను చివరి నిమిషంలో ఆహ్వానించడంతో గుర్రుగా ఉన్న గవర్నర్‌ ధాంకర్‌ బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చిన ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు సీఎం మమత, స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ వెళ్లారు. అయితే, మమతను మర్యాదపూర్వకంగా పలుకరించకుండా.. స్వాగతం పలికేందుకు వచ్చిన ఆమె పట్టించుకోకుండా గవర్నర్‌ ముందుకుసాగారు.

గవర్నర్‌ అనూహ్యంగా తనను విస్మరించి ముందుకుసాగడంతో మమత నిర్ఘాంతపోయారు. అయినా సహనం కోల్పోకుండా ఒక అడుగు వెనుకకు వేశారు. గుంభనంగా ముందుకుసాగిన గవర్నర్ స్పీకర్‌తో కలిసి అసెంబ్లీలోకి వెళ్లారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చివరి నిమిషంలో తనకు ఆహ్వానం పంపడంపై గవర్నర్‌ అసంతృప్తి వెళ్లగక్కారు. అంతేకాకుండా తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని రెండుసార్లు ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఇక, గవర్నర్‌ తన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్రాల అధికారాలు, సమాఖ్య విధానం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. చివర్లో మమత సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజ్యాంగ అధిపతి పదవిని రాజీపడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్‌ ప్రసంగం విన్న ప్రతిపక్షాలు బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధింబోతున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గవర్నర్‌ ప్రసంగంతో ఈ ఘర్షణ ముగిసిపోలేదు. ఆయన అసెంబ్లీని వీడి వెళుతుండగా.. టీఎంసీ ఎమ్మెల్యేలు జై బంగ్లా, జై హింద్‌ అంటూ నినాదాలు చేశారు. మమతతో మాట్లాడకుండానే గవర్నర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, తాను వెళుతుండగా టీఎంసీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంపై గవర్నర్‌ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలుస్తోంది. దీనిపై తన కారులో కూర్చున్న స్పీకర్‌ను ఆయన గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన మారకపోతే తానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. ఇక, మమత కూడా గవర్నర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెళ్లిన తర్వాత అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనలాగే ఎవరూ ప్రవర్తించరు. ప్రధాని మోదీ కూడా మేం కనిపిస్తే పలుకరిస్తారు. కానీ గవర్నర్‌ ప్రవర్తన చూడండి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారన్న సంగతి తెలుసు. ఆయనను ఏ ఉద్దేశంతో రాష్ట్రానికి పంపించారో కూడా తెలుసు’ అంటూ మమత తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు