ఈ సుబుద్ధి.. ఒక్కసారీ గెలవలేదు

8 Apr, 2019 12:25 IST|Sakshi

గజనీ మహ్మద్‌ భారతదేశంపై 17 సార్లు దండెత్తి విఫలుడయ్యాడని చారిత్రక కథనం. ఒడిశాకు చెందిన ఈ ఎన్నికల గజనీ ఏకంగా 32 సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ముప్పయి మూడోసారి మళ్లీ బరిలో దిగారు. అదీ రెండుచోట్ల. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన హోమియోపతి వైద్యుడు శ్యామ్‌బాబు సుబుద్ధి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అస్కా, బెర్హంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నారు.1962 నుంచి ఇంత వరకు ఆయన లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 సార్లు పోటీచేసి ‘విజయవంతంగా పరాజయం’ పాలయ్యారు.

అయినా వెరవకుండా ఇప్పుడు మరోసారి పోటీకి సై అంటున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనే కాకుండా జూన్‌ 11న రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని 84 ఏళ్ల సుబుద్ధి చెప్పారు. గతంలో సుబుద్ధి పీవీ నరసింహారావు, బిజు పట్నాయక్‌ వంటి ఉద్దండులతో పోటీ పడ్డారు. ఈసారి తనకు ఎన్నో పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని ఆయన అంటున్నారు. ఎన్నికల ఖర్చంతా ఆయనే సొంతంగా పెట్టుకుంటారట. రైళ్లు, బస్సుల్లో, మార్కెట్లలో ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘గెలుపోటములను నేను పట్టించుకోను. అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడుతూనే ఉంటాను. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు శ్యామ్‌.

మరిన్ని వార్తలు