నరేంద్ర మోదీపై సిద్ధరామయ్య ప్రశంసలు

8 May, 2018 15:53 IST|Sakshi
నరేంద్ర మోదీ.. సిద్ధరామయ్య (పాత చిత్రం)

సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశంసలు గుప్పించారు. గ్రామాలు సుభిక్షంగా ఉండటానికి కారణం నరేంద్ర మోదీనే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిద్ధరామయ్య ఏంటి? హఠాత్తుగా మోదీని పొగడటం ఏంటనుకుంటున్నారా?..

అసలు విషయం...  మంగళవారం మళవల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నరేంద్ర స్వామి తరపున సిద్ధూ ప్రచారం చేస్తూ ‘గ్రామాలకు రోడ్లు, మంచి నీటి సౌకర్యం, స్కూళ్లు ఇలా అభివృద్ధి పనులకు కారణం నరేంద్ర మోదీనే’ అని పేర్కొన్నారు. వెంటనే ప్రజల్లో కొందరు గట్టిగా అరవగా.. స్టేజీపైనే ఉన్న నరేంద్ర స్వామి ఆయన్ని అప్రమత్తం చేశారు. ఆ వెంటనే సిద్ధరామయ్య తన పొరపాటును సవరించుకుంటూ.. ‘నరేంద్ర అనేది చాలా ముఖ్యమైన పదం. స్వామీ ఇక్కడ ఉన్నారు. మోదీ గుజరాత్‌లో ఉంటారు. నరేంద్ర మోదీ కల్పితం, నరేంద్ర స్వామి సత్యం’ అంటూ తన ప్రసంగం కొనసాగించారు. 

రెండోసారి కూడా... ఆ తర్వాత కొద్దినిమిషాలకే సిద్ధరామయ్య మరోసారి నోరు జారారు. ఈసారి ఏకంగా నరేంద్ర మోదీకి ఓట్లేయ్యండని ప్రజలను కోరారు. ‘నరేంద్ర మోదీకి మీరు వేసే ప్రతీ ఓటు. నాకు వేసినట్లే. ఆయన్ని ఆఖండ మెజార్టీతో గెలిపించండి’ అని వ్యాఖ్యానించారు. ఈసారి కార్యకర్తలు గోల చేయటంతో సిద్ధరామయ్య సారీ చెప్పి ప్రసంగం కొనసాగించారు. ఇలా నిమిషాల వ్యవధిలో ఆయన చేసిన తప్పిదం తాలూకు వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ‘సిద్ధరామయ్య మైండ్‌లో మోదీ ఎంత బలంగా నాటుకు పోయాడో ఇదే నిదర్శనం’ అంటూ కొందరు, ‘బీజేపీ-కాంగ్రెస్‌ నేతలు దొందూ దొందే’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.  గతంలో అమిత్‌ షా కూడా మీడియా సమావేశంలో యెడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అని వ్యాఖ్యానించగా.. పక్కనే కూర్చున్న యెడ్డీ నివ్వెరపోయారు. ఆ తప్పిదాన్ని కాంగ్రెస్‌ పార్టీ విపరీతంగా ట్రోల్‌ చేసింది.  సొంత పార్టీని ఇరుకున పెట్టిన వైనం

మరిన్ని వార్తలు