సిద్దూకి.. అక్కడైతే గెలుపు సులభం..!

10 Apr, 2018 20:31 IST|Sakshi
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీ చీఫ్‌ జి.పరమేశ్వర

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి. పరమేశ్వర రెండేసి స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావించిన సీఎం.. ఆ స్థానంలో జేడీఎస్‌, బీజేపీ ఒప్పందం చేసుకున్నాయన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో చాముండేశ్వరి నియోజక వర్గంతో పాటు, బగల్‌కోట్‌ జిల్లాలోని బదామి నుంచి సీఎం పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆయన కోసం బదామి ప్రస్తుత ఎమ్మెల్యే బీబీ చిమ్మనకట్టి తన సీటు త్యాగం చేయడానికి సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది.

అక్కడైతే గెలుపు సులభం..
బదామీలో కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. సిద్దరామయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. అక్కడి ప్రజలు సీఎంను తమ నాయకుడిగా అంగీకరించారనే కారణంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అయితే రెండు స్థానాల నుంచి పోటీచేసేందుకు అధిష్టానం నుంచి సిద్దరామయ్యకు గ్రీన్‌ సిగ్నల్‌ రాగా.. జి.పరమేశ్వరకు రెండు స్థానాలకు సంబంధించి టికెట్‌ వస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన పరమేశ్వర ఈసారైనా విజయం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

కుమారుడి కోసం..
చాముండేశ్వరి నుంచి ఐదుసార్లు గెలుపొందిన సిద్దరామయ్య నియోజకవర్గాల విభజన తర్వాత వరుణ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కుమారుడు యతీంద్ర కోసం తనకు అనుకూలంగా ఉన్న ఈ స్థానాన్ని సిద్దు వదులుకున్నారని తెలుస్తోంది. కాగా చాముండేశ్వరి ప్రస్తుత ఎమ్మెల్యే జీటీ దేవెగౌడకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మద్దతు ఉంది. సిద్దును ఓడించేందుకు ఆయన ఇప్పటి​కే వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే హెచ్‌డీ దేవెగౌడ.. ‘సిద్దరామయ్య ఒక దురహంకారి. పార్టీని దుర్వినియోగం చేశాడు. అటువంటి మోసకారిని చాముండేశ్వరి ప్రజలు ఎంతమాత్రం నమ్మరంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఓడిపోతామనే భయం వల్లే...
కాంగ్రెస్‌ నాయకులకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. వారు పిరికిపందలని.. అందుకే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.

>
మరిన్ని వార్తలు