హంగ్‌ ట్విస్ట్‌: సిద్దరామయ్య కీలక ప్రకటన

13 May, 2018 16:17 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 15న ఫలితాలు రానున్నాయి. ఫలితాల్లో ప్రజానాడీ ఎలా ఉందో తెలియదు కానీ.. మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేల్చాయి. హంగ్‌ అసెంబ్లీ వస్తే.. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. దీంతో హంగ్‌ ఫలితాలు వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రధాన పార్టీలు ఇప్పటినుంచి తర్జనభర్జన పడుతున్నాయి. ఒకవేళ హంగ్‌ వస్తే.. జేడీఎస్‌ మద్దతు కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచి వ్యూహం సిద్ధం చేస్తోంది.

జేడీఎస్‌ను తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తాము గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకునేది అధిష్టానమేనంటూ ట్విస్టు ఇచ్చారు. అయితే, గెలిచిన ఎమ్మెల్యేల మాట వినాలని, వారి అభీష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మెలిక పెట్టారు. జేడీఎస్‌ మద్దతు కోసమే సిద్ధరామయ్య దళిత సీఎం ప్రకటన చేసినట్టు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు