రసకందాయంలో కన్నడ రాజకీయం

17 Jan, 2019 03:54 IST|Sakshi

కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్‌ కమలం’!

కాంగ్రెస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలతో బీజేపీ మంతనాలు!

గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో బీజేపీ ఎమ్మెల్యేలు

సంఖ్యాబలం చాటేందుకు 18న కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం

సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’ను ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో కర్నాటక రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్, జేడీఎస్‌ కూటమి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందంటూ బీజేపీ తమ 104 మంది ఎమ్మెల్యేలను హరియాణాలోని గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఉంచిన విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్‌లోని దాదాపు ఆరుగురు అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబైలో మకాం వేసి బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే, తమ ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌ను వీడటం లేదని, ఆ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లోనే ఉన్నారని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

రేపు(జనవరి 18న) పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు, ఇన్నాళ్లూ కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతును ఉపసంహరించుకుని బీజేపీ వైపునకు వెళ్లారు. వారిలో ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యే కాగా, మరొకరు కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ(కేపీజేపీ)కి చెందిన సభ్యుడు. దాంతో బీజేపీ బలం 106కి చేరింది. బీజేపీ కుయుక్తులు ఫలించవని, తన ప్రభుత్వానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు తామేమీ ప్రయత్నించడం లేదని, తమ ప్రమేయం లేకుండానే, అంతర్గత విభేదాలతోనే కుమారస్వామి సర్కారు కూలుతుందని బీజేపీ పేర్కొంది.

వీరిపైనే దృష్టి
ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్‌ జార్కిహోళి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్, బి.నాగేంద్ర, ప్రతాప్‌గౌడపాటిల్, మహేశ్‌ కుమటళ్లి, బీసీ పాటిల్, కంప్లి గణేశ్, భీమానాయక్, డాక్టర్‌ సుధాకర్, శ్రీనివాసగౌడ సొంత పార్టీ కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వీరు పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది.

రేపు సీఎల్పీ భేటీ
ప్రాంతీయ కర్ణాటక ప్రజ్ఞావంత జనతా(కేపీజేపీ) పార్టీకి చెందిన ఆర్‌. శంకర్, స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్‌. నగేశ్‌లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్‌–జేడీఎస్‌ బలం 117కి తగ్గిపోయింది. వారిద్దరు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం 106కు పెరిగింది.  అధికార కూటమిలో అంతర్గత విభేదాల్ని ఆసరాగా చేసుకుని అటువైపు నుంచి ఎమ్మెల్యేల్ని ఆకర్షించేందుకు బీజేపీ ‘ఆపరేషన్‌ లోటస్‌’ను ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో తమ సభ్యులు జారిపోకుండా బీజేపీ వారందరిని గురుగ్రామ్‌లోని ఓ విలాసవంత హోటల్‌కు తరలించింది. మరోవైపు, రేపు బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగే శాసనసభా పక్ష సమావేశం ద్వారా అంతా సవ్యంగానే ఉందనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. బడ్జెట్‌ గురించి చర్చిండమే అజెండాగా ఈ సమావేశం జరగాల్సి ఉండగా, తాజా రాజకీయ పరిస్థితులే ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.

పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు..
కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇతర కేపీసీసీ నేతలు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే విషయంపై చర్చించారు. అవసరమైతే ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించాలని యోచిస్తున్నారు.  గురుగ్రామ్‌ హోటల్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప సమావేశమై సమాలోచనలు జరిపారు.   

మా సంకీర్ణం భద్రం: కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ సభ్యులంతా తమను సంప్రదిస్తూనే ఉన్నారని, పార్టీలో అంతా సవ్యంగానే ఉందని ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర చెప్పారు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా, జాతీయ స్థాయిలో ఏర్పడబోయే విపక్ష మహా కూటమి విఫలమవుతుందనే సంకేతాన్ని బీజేపీ ఇవ్వాలనుకుంటోందన్నారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించవని నొక్కిచెప్పారు. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందిస్తూ..తమ సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు లేవని, కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యులందరి మద్దతు ప్రభుత్వానికే ఉందన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే కూటమిలో విభేదాలున్నాయంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.

బీజేపీ వ్యూహం
కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వానికి 117మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 104 సభ్యుల బలం ఉంది. తాజాగా ఇద్దరు స్వతంత్రులు బీజేపీ వైపు వచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే  కాంగ్రెస్, జేడీ(ఎస్‌)ల నుంచి  13 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 211కి తగ్గుతుంది. మెజారిటీకి అవసరమైన సభ్యుల సంఖ్య 106 అవుతుంది.

ప్రస్తుతం సొంత సభ్యులు 104, స్వతంత్రులు ఇద్దరు కలిస్తే బీజేపీ బలం 106కి చేరుతుంది. కాంగ్రెస్‌– జేడీఎస్‌ సభ్యులు నేరుగా బీజేపీకి మద్దతిస్తే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుంది. అందుకే ‘ఆపరేషన్‌ కమలం’ ద్వారా రాజీనామా చేసిన వారిని ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడమే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలు అంచనా వేస్తుండటంతో.. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా వస్తే లాభమని బీజేపీ అంచనా.

ఆపరేషన్‌ కమలం అంటే.. :దక్షిణాదిన తొలిసారిగా ఇక్కడ పాగావేసిన కమలనాథులు తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆపరేషన్‌ కమలం అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బుని, అధికారాన్ని ఎరగా వేసి చీలిక తెచ్చి తమవైపు లాక్కోవడమే ఆపరేషన్‌ కమలం లక్ష్యం.

బెంగళూరులో ఆందోళనకు దిగిన జేడీఎస్‌ ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు