సిద్దరామయ్య యూటర్న్..!

11 Jan, 2018 15:37 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ 'ఉగ్రవాదం' అంశంపై వాగ్బాణాలు సంధించుకుంటున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్‌ ఉగ్రవాద సంస్థలంటూ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. తాను నేరుగా బీజేపీ, ఆరెస్సెస్‌లను నిందించలేదని, హిందూత్వ ఉగ్రవాదం గురించే మాట్లాడానని సిద్దరామయ్య చెప్పారు.

'రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వ ఉగ్రవాదాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌ వ్యాప్తి చేస్తున్నాయనే నేను చెప్పాను. విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసేవాళ్లు నా దృష్టిలో ఉగ్రవాదులే' అని సిద్దరామయ్య గురువారం మైసూర్‌ సమీపంలోని ఎంఎం హిల్స్‌లో విలేకరులతో అన్నారు.

బీజేపీ, ఆరెస్సెస్‌, బజరంగ్‌ దళ్‌ సంస్థల్లో ఉగ్రవాదులు ఉన్నారని సిద్దరామయ్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అతివాద ఎస్డీపీఐ అయినా, బజరంగ్‌ దళ్‌ అయినా శాంతిని భగ్నం చేస్తే విడిచిపెట్టబోమని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు