1 కాదు 2

12 Apr, 2018 08:32 IST|Sakshi

చాముండేశ్వరి, బాదామినుంచి సీఎం సిద్ధు పోటీ

రహస్య సర్వేతో నిర్ణయం ?

అందరూ అనుకున్నట్లుగానే సీఎం సిద్ధరామయ్య ఒకటి కాదు, రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేయాలని నిశ్చయానికొచ్చారు. ఒకవైపు బీజేపీ హోరు, మరోవైపు రహస్య సర్వేతో ఎప్పుడూ లేని నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండు చోట్ల పోటీ చేస్తే ప్రత్యర్థులకు ఆయుధం అందించినట్లే అవుతుందనే వాదన కూడా ఉంది.

సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు పడవల ప్రయాణానికి కాంగ్రెస్‌ అధిష్టానం పచ్చజెండా ఊపింది. దీంతో ఎన్నికల్లో మైసూరు సిటీలోని చాముండేశ్వరితో పాటు ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోటె జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీభేటీలో ఇదే విషయంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సిద్ధరామయ్య రెండుచోట్ల పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అంతిమ నిర్ణయం మాత్రం సిద్దరామయ్యకే వదిలేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయాల్లోకి అడుగిడిన మొదటి ఎన్నికల్లోనే తనకు గెలుపునందించిన, అలాగే గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మరోసారి ఉప ఎన్నికలో ఆదుకున్న చాముండేశ్వరి నియోజకవర్గం నుంచే ఈ దఫా బరిలోకి దిగాలని సిద్ధరామయ్య నిర్ణయించుకున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలుగా ఆయన చెబుతున్నారు.

సర్వేతో తారుమారు
 సిద్ధరామయ్య చేయించిన రహస్య సర్వేలో చాముండేశ్వరిలో ఎదురుగాలి వీస్తున్నట్లు కాంగ్రెస్‌వర్గాలు తెలిపాయి. చాముండేశ్వరి నుంచి జేడీఎస్‌ తరఫున పోటీ చేయనున్న జీ.టీ.దేవేగౌడ నుంచి గట్టిపోటీ తప్పదని సర్వే హెచ్చరించినట్లు సమాచారం. ఓడిపోయినా ఓడిపోవచ్చని, అందుకే చాముండేశ్వరితో పాటు మరొక నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలంటూ నివేదికలో సూచించినట్లు సమాచారం. అందులో బాదామిని కూడా సూచిస్తూ, అక్కడ పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకని సూచించినట్లు సమాచారం. బీజేపీ అధినేత అమిత్‌షా, ప్రధాని మోదీ కర్ణాటకపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని కాంగ్రెస్‌ కలవరపడుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు పోటీ చేయాలని సీఎం సిద్ధరామయ్యకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా, సిద్ధరామయ్య రెండుచోట్ల పోటీ చేస్తే బీజేపీ, జేడీఎస్‌లు విమర్శల దాడిచేసే అవకాశముంది. పరాజయం భయంతోనే ఇలా చేశారనే ఆరోపించవచ్చు.

పరమేశ్వర్‌కు దక్కని అవకాశం  
తానూ రెండు చోట్ల పోటీ చేస్తానన్న కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ ఆశలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ నీళ్లు చల్లినట్లు సమాచారం. గత ఎన్నికల్లో తుమకూరు జిల్లాలోని కొరటగెరెలో ఆయన జేడీఎస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఒకవేళ గెలిచి ఉంటే సీఎం అయినా అయ్యిండేవారు. ముందు జాగ్రత్తగా సిద్ధరామయ్య బాటలోనే నడవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈసారి కొరటగెరెతో పాటు బెంగళూరులోని పులకేశినగర్‌ నుంచి పోటీ చేస్తానని ఆయన హైకమాండ్‌ను కోరగా, తిరస్కరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు