రమేశ్‌ భేష్‌; సిద్దు మెచ్చుకోలు

29 Jul, 2019 15:09 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ ఎటువంటి పక్షపాతం లేకుండా పనిచేశారని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశంసించారు. నిజాయితీగా నిర్ణయాలు తీసుకుని స్పీకర్‌ పదవిలో ఉన్నవాళ్లు ఎలా ఉండాలన్న దానికి ఉదాహరణగా నిలిచారని మెచ్చుకున్నారు. స్పీకర్‌గా ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, సిద్దరామయ్య కోరితేనే తాను స్పీకర్‌ పదవిని చేపట్టినట్టు రమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. 14 నెలల 4 రోజులు పాటు శాసనసభ సభాపతిగా తాను రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి పనిచేశానని తెలిపారు. అసెంబ్లీ ప్రతిష్టను కాపాడేందుకు తన శక్తిమేరకు కృషి చేసినట్టు చెప్పారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని అన్నారు. అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కడం రాజ్యాంగానికి మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంస్కరణలు అమలులో ఉన్నా అవినీతి కట్టడి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గడంతో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం బెంగళూరు నుంచి సిద్దరామయ్యతో పాటు హైదరాబాద్‌ చేరుకుని జైపాల్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు