మహిళపై సిద్దరామయ్య ఫైర్‌

29 Jan, 2019 04:27 IST|Sakshi

ఆమె నుంచి మైక్‌ లాక్కునే క్రమంలో చున్నీ లాగిన వైనం

మైసూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఆ కార్యకర్తపై సిద్ధరామయ్య గట్టిగా కేకలు వేయడం, మైక్‌ను లాగినపుడు ఆమె చేతిలోని మైక్‌తోపాటు దుపటా ఆయనచేతిలోకి రావడం వివాదమైంది. మైసూరులోని గర్గేశ్వర గ్రామంలో సిద్దరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో సిద్దరామయ్య కొడుకు, స్థానిక ఎమ్మెల్యే యతీంద్రతోపాటు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాలూకా పంచాయతీ ఉపాధ్యక్షురాలు జమలాల్‌ లేచి.. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే యతీంద్ర గెలిచాక మళ్లీ రానేలేదని చెప్పారు.

‘యతీంద్రను ఎన్నికల తర్వాత మళ్లీ ఈ రోజే చూస్తున్నా’ అని అన్నారు. దీంతో సిద్దరామయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. నియోజకవర్గానికి యతీంద్ర వస్తూనే ఉన్నారని సిద్ధరామయ్య చెప్పినా జమలాల్‌ బల్లగుద్ది మరీ వాదించారు..  దీంతో సిద్దరామయ్య ‘నా ముందే టేబుల్‌పై కొట్టి మాట్లాడతావా? ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదా నోరు మూసుకుని కూర్చో’అని పరుషంగా ఆదేశించారు. అయినా సరే జమలాల్‌ మరోసారి బల్లగుద్ది మాట్లాడారు. దీంతో సిద్ధరామయ్య అరుస్తూ ఆమె చేతిలో ఉన్న మైకును  లాగేసుకున్నారు.

ఈ క్రమంలో ఆమె ధరించిన దుపట్టా జారింది. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనను సుమోటొగా నమోదు చేస్తున్నట్లు జాతీయ మహిళా హక్కుల కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తెలిపారు. మహిళా కార్యకర్తతో సిద్దరామయ్య అనుచిత ప్రవర్తనపై విచారణ జరిపి, చర్య తీసుకోవాలని కర్ణాటక పోలీసులను కోరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కౌరవుల ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు