రెండో సీటూ కావాలి!

20 Apr, 2018 02:36 IST|Sakshi

బాదామీ స్థానం కోసం పట్టుబడుతున్న సిద్దరామయ్య!

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి స్థానం నుంచే పోటీ చేస్తారా? లేక ఉత్తర కర్ణాటకలోని బాదామీ నుంచి కూడా పోటీ చేయనున్నారా? ఈ విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించినా సీనియర్‌ నాయకులు ఖర్గే,  మొయిలీల ఒత్తిడితో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను చాముండేశ్వరి స్థానానికే పరిమితం చేసింది.

బాదామీలో దేవరాజ్‌ పాటిల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై తన అసంతృప్తిని ఇప్పటివరకు సిద్దరామయ్య బహిరంగంగా వెల్లడించలేదు కానీ.. బాదామీ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని వివిధ వేదికలపై వ్యక్తపరిచారు. బాదామీ నియోజకవర్గ నేతలు తనను పోటీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు.

అధిష్టానంతో చర్చలు
రాహుల్‌ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ మొదట్నుంచీ రెండో స్థానంలో పోటీని తోసిపుచ్చింది. అయినా, బీసీల చాంపియన్‌గా పేరున్న సిద్దరామయ్యను నిరాశకు గురిచేస్తే ఫలితాలు వేరోలా ఉంటాయనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అందుకే పాటిల్‌కు ఇంతవరకు బీ–ఫామ్‌ ఇవ్వలేదు. అటు, సీఎం రెండో సీటు కోసం అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏడుసార్లు చాముండేశ్వరి నుంచి పోటీ చేసిన సీఎం ఐదుసార్లు గెలిచారు. ఈ సారి చాముండేశ్వరి నుంచి గెలవటం సులభం కాదనే అభిప్రాయంలో సీఎం ఉన్నారని తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు