వేడెక్కుతున్న కర్నాటకం

26 Apr, 2018 08:39 IST|Sakshi

ట్విట్టర్‌ వేదికగా వార్‌ 

మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ డజనుకి పైగా ర్యాలీల్లో పాల్గొన్నా రాని ఊపు ఒక్క ట్వీట్‌తో వచ్చేస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి జనాన్ని సమీకరించి బహిరంగ సభ నిర్వహించినా రాని ప్రచారం ఒక్క ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌తో వచ్చేస్తోంది. నగర వీధుల్లో గల్లీ గల్లీ తిరిగినా రాని ఫలితం ఒక్క వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా వచ్చేస్తోంది. అందుకే కర్ణాటకలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ సోషల్‌ మీడియా ఒక వార్‌ రూమ్‌గా మారిపోతోంది. ఎన్నికల ఎజెండాలు, వ్యూహాలు, హామీలు, ప్రత్యర్థులపై బురద జల్లడాలు ఏదైనా సోషల్‌ మీడియా వేదికగానే సాగుతోంది. ట్వీట్లు రీట్వీట్లు, ఫేస్‌బుక్‌ కామెంట్లు, వాట్సాప్‌ ఫార్వార్డ్‌లతో మండే ఎండలకు దీటుగా ఎన్నికల ప్రచార హీట్‌ పెరిగిపోతోంది.

ఒక్క ట్వీట్‌తో రాజకీయ దుమారం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన ఒక్క ట్వీట్‌ రాజకీయ దుమారాన్నే రేపింది. మోదీ కర్ణాటక ప్రచారానికి రానున్న నేపథ్యంలో ‘ఉత్తర భారతం దిగుమతుదారులైన ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ కోసం మేము ఎదురు  చూస్తున్నాం. రాష్ట్రంలో బీజేపీకి నాయకులెవరూ లేరని వాళ్లు అంగీకరించారు. సీఎం అభ్యర్థి యడ్యూరప్పను డమ్మీగా మార్చేశారు. ప్రధాని రావొచ్చు, వెళ్లొచ్చు. కానీ విజేత ఎవరో అందరికీ తెలిసిందే’ అంటూ సిద్దరామయ్య ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌ ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విభజన తెచ్చేలా ఉందంటూ బీజేపీ మండిపడింది. ట్విట్టర్‌ వేదికగానే బీజేపీ నేతలు రీట్వీట్ల వర్షం కురిపించారు. చాముండేశ్వరిలో ఓటమి భయంతో సిద్దరామయ్య ఉత్తర, దక్షిణ భారతాలు అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, మోదీ ఉత్తరం నుంచి దిగుమతి అయితే, 10 జన్‌పథ్‌ మరెక్కడి నుంచి వచ్చిందని అంటూ రీ ట్వీట్లు చేశారు. బెంగళూరులో మీ బాత్‌రూమ్‌కి ఇటలీ నుంచి సామాగ్రి తెచ్చుకుంటే అది దిగుమతి కాదా..? అత్యాచార కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీ వేణుని కర్ణాటక ఇన్‌చార్జ్‌గా కేరళ నుంచి దిగుమతి చేసుకోలేదా ? అంటూ బీజేపీ మద్దుతుదార్లు ట్వీట్లతో నిలదీశారు.

  • కర్ణాటకలో ఓటర్లు: 4.96 కోట్లు
  • స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ఓటర్లు: 3.5 కోట్లు
  • ప్రతీ రోజూ ఇంటర్నెట్‌ వాడుతున్న ఓటర్లు: 3 కోట్లు
  • ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉన్న ఓటర్లు: 2.5 కోట్లు
  • యూ ట్యూబ్‌ అలర్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకున్న ఓటర్లు: 2.4 కోట్లు 

పార్టీల సోషల్‌ వ్యూహాలు 
కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు అనుక్షణం సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ ఎవరెక్కడ ఏ పోస్టు పెట్టినా గట్టిగా కౌంటర్‌ ఇస్తున్నాయి. సోషల్‌ మీడియా ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5 వేల మంది వాలంటీర్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పరిశీలిస్తూ, పై చేయి సాధించడానికి వ్యూహాలను రచించే పనిలో ఉన్నారు. పార్టీ సోషల్‌ మీడియా రూమ్‌లో 67 టీవీలను ఏర్పాటు చేసి క్షణం క్షణం  ఎన్నికల ప్రచార శైలిని గమనిస్తున్నారు. 23 వేల వాట్సాప్‌ గ్రూపుల్ని ఏర్పాటు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీతో పోల్చి చూస్తే కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా యూనిట్‌ చాలా చిన్నది.  అందులో కేవలం 50 మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారు.

ఫేస్‌బుక్‌ , ట్విట్టర్‌లో కాంగ్రెస్‌పై ఎలాంటి వ్యతిరేక ప్రచారం జరుగుతోందో గమనిస్తూ, దానిని కౌంటర్‌ చేసే పనిలో వీళ్లు ఉన్నారు. కాంగ్రెస్‌ టీమ్‌లో  కొందరు జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థులు కూడా చేరి గ్రాఫిక్‌ వర్క్స్‌తో పొలిటికల్‌ సెటైర్‌లు రూపొందిస్తున్నారు. జేడీ(ఎస్‌) కూడా సోషల్‌ మీడియాలో ఎంతో కొంత తన ఉనికిని చాటుకుంటోంది.  కుమరన్న ఫర్‌ సీఎం పేరుతో ఒక డిజిటల్‌ గేమ్‌ను రూపొందించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. ఈ గేమ్‌ని ఆడేవాళ్లు ఒక్కో లెవల్‌ దాటుతూ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు తాము రాష్ట్రానికి ఏమేం చేశాము, పార్టీ  మేనిఫేస్టో వంటి వివరాలు వస్తుంటాయి. 50 మంది టెక్కీలతో సోషల్‌మీడియా రూమ్‌ కూడా ఏర్పాటు చేసి నగర ప్రాంత ఓటర్లని ఆకర్షించే పనిలో ఉంది. 

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు