ఐక్యతకు మారుపేరు సిద్దిపేట

21 Apr, 2019 13:16 IST|Sakshi

సిద్దిపేటజోన్‌:  సిద్దిపేట నియోజకవర్గ ఐక్యతకు, పట్టుదలకు మారుపేరని మాజీ మంత్రి  హరీశ్‌రావు అన్నారు. అలాంటి సిద్దిపేట పేరును మళ్లీ ఒకసారి  రాష్ట్రం మొత్తంగా తెలిసేలా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.  శనివారం సిద్దిపేట పట్టణంలోని మినీ ఫంక్షన్‌హాల్‌లో సిద్దిపేటరూరల్, అర్బన్, నారాయణరావుపేట మండలాల  ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని  రికార్డు సాధిద్దామని పిలుపునిచ్చారు.  పార్టీ గ్రామ అధ్యక్షులు, సర్పంచ్, నాయకులు కలిసి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం తీసుకుని ఐక్యతకు మారుపేరుగా నిలవాలన్నారు.   కార్యకర్తలంతా తన కుటుంబమని,  అందరూ బాగుండాలనే కోరుకుంటానని, అదే విధంగా అందరూ ఉండాలనేదే నా ఆలోచన అన్నారు.  గ్రామాల్లో అందరూ సమన్వయంతో ఒక వ్యక్తిని నిర్ణయించడండని పిలుపునిచ్చారు.

ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలన్నారు.  పార్టీ ఎవరికి టిక్కెట్‌ ఇస్తే వారికే కార్యకర్తలు సైనికుల్లాగా  పని చేయాలన్నారు. టిక్కెట్‌  ఎవరికి ఇచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలన్నారు. కష్టపడి  పని చేసే కార్యకర్తకు గుర్తింపు తప్పకుండా ఉంటుందన్నారు. ప్రతి నాయకున్ని, ప్రజాప్రతినిధిని కార్యకర్తను కంటికిరెప్పలా చూసుకుంటానన్నారు.  ఎంపీటీసీ అభ్యర్థి  ఎంపిక నిర్ణయం మీ చేతుల్లోనే  ఉందన్నారు. అందరు కలిసి ఎవరిని సూచిస్తే వారికే పార్టీ టిక్కెట్‌ వస్తుందన్నారు. సిద్దిపేటకు ఎన్నికలంటే కొత్త కాదన్నారు.  ఎన్నిక ఏదైన టీఆర్‌ఎస్‌దే విజయమని మరోసారి ఆ గౌరవాన్ని నిలుపుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగిరెడ్డి,  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీనివాసరావు,  బాల్‌రంగం,  దువ్వల మల్లయ్య,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు