టీకాంగ్రెస్‌ను ఇరుకున పెట్టిన సిద్ధూ

13 Apr, 2018 14:48 IST|Sakshi
పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశారు. రాష్ట్రంలోని ఇసుక పాలసీని పంజాబ్‌లో అమలు చేసేందుకు కాళేశ్వరం పరిధిలోని ఇసుక రీచ్‌లను గురువారం అధికారుల బృందంతో కలిసి సిద్దూ క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని సిద్దు ప్రసంశించారు. ఇసుక అక్రమాలకు తెలంగాణ సర్కార్‌ అడ్డుకట్ట వేసిందని కితాబిచ్చారు. ఇలాంటి విధానమే పంజాబ్‌లో అమలు చేస్తామని సిధ్దు వివరించారు. 

అయితే సిద్ధూ పర్యటన కాంగ్రెస్‌ నాయకులకు ఇపుడు తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్చగా కొనసాగుతోందని, సర్కారు కనుసన్నల్లోనే ఇసుక మాఫియా జరుగుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్‌కు ముఖ్యంగా ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించింది. అయితే పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సిద్దూ ఇసుక విధానం బాగుందని, తెలంగాణ సర్కార్‌పై ప్రశంసలు కురిపించడం.. రాష్ట్ర నేతలకు మింగుడు పడటం లేదు. తెలంగాణలో సిద్ధూ పర్యటన వద్దంటూ టీ కాంగ్రెస్‌ ఇంతకుముందే అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. కానీ టీ కాంగ్రెస్‌ అభ్యంతరాలను తోసిపుచ్చి మరీ సిధ్దూ ఇక్కడ పర్యటించి పార్టీని ఇరుకున పెట్టారు.

మరిన్ని వార్తలు