సిద్ధూపై మంత్రుల గుస్సా

2 Dec, 2018 04:36 IST|Sakshi

మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌

చండీగఢ్‌/జైపూర్‌: తన కెప్టెన్‌ రాహుల్‌ గాంధీయే తప్ప, ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కాదంటూ పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్‌ గాంధీ సలహా మేరకే పాక్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ పనుల ప్రారంభానికి వెళ్లినట్లు సిద్ధూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీటిపై సొంత కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శలు చేయడంతో సిద్దూ కాస్తంత వెనక్కి తగ్గి..‘పాక్‌లో నా పర్యటన విషయంలో రాహుల్‌గాంధీ జోక్యం ఏమీ లేదు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యక్తిగత ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే’ అంటూ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ సిద్ధూపై తోటి మంత్రివర్గ సభ్యుల ఆగ్రహం తగ్గలేదు. దీనిపై మంత్రులు తృప్త్‌ రాజీందర్‌ సింగ్‌ బజ్వా, సుఖ్‌బీందర్‌ సింగ్‌ సర్కారియా, రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి మాట్లాడుతూ.. ‘రాహుల్‌ గాంధీ మా నేత. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. పంజాబ్‌లో మా ప్రభుత్వ కెప్టెన్‌ అమరీందర్‌. ఆయన కెప్టెన్సీలోని మంత్రి వర్గంలో  సిద్ధూయే కాదు సీఎం అమరీందర్‌ను కెప్టెన్‌గా అంగీకరించని వారెవరైనా మంత్రి వర్గం నుంచి వెంటనే తప్పుకోవాలి. లేదా క్షమాపణ చెప్పి పంజాబ్‌లో సీఎం అమరీందరే కెప్టెన్‌ అన్న విషయం అంగీకరించాలి’ అని అన్నారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యల వ్యవహారం సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు