ఎవరిని సంప్రదించి ఎన్నికలు వాయిదా వేశారు?

16 Mar, 2020 16:31 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జీరో స్థాయిలో ఉందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రమాదమేమీ లేదని పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. అధికారం, పరిపాలన ఈసీ చేస్తామంటే కుదరదన్నారు. ప్రభుత్వ విధి, విధానాలకు అనుగుణంగా ఎలక్షన్‌ కమిషనర్‌ బాధ్యతలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీకి విచక్షణాధికారాలు ఎవరిచ్చారు? ఎవరిని సంప్రదించి ఎన్నికలు వాయిదా వేసిందని వరుస ప్రశ్నలు సంధించారు. ఏపీలో ఒక్క కరోనా కేసు నిర్ధారణ కాలేదని.. అలాంటిది కరోనా వైరస్‌ను సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (వాయిదా వేయాలని మేమే కోరాం)

14 ఏళ్లలో ఒక్కసారే స్థానిక సంస్థల ఎన్నికలు
ఈ నిర్ణయంతో ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. బాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారనేది స్పష్టమవుతోందన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ, అధికారులపై చర్యలు తీసుకోవడం కుట్రగా అభివర్ణించారు. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.5వేల కోట్ల నిధులు ఆగిపోయాయన్నారు. చంద్రబాబుకు స్థానిక ఎన్నికల నిర్వహణే ఇష్టం లేదని, ఇప్పుడు ఆయన రాక్షసానందంలో ఉన్నారని తెలిపారు. బాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే కేవలం ఒక్కసారే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. (భయానకం కాదు, మనోహరం)

మరిన్ని వార్తలు