కులాల మధ్య చిచ్చుపెడుతున్న బాబు

11 Jun, 2018 16:36 IST|Sakshi
అన్నెం జయరామిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి

కొలిమిగుండ్ల : కాపులను బీసీలో, వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని కులాల మధ్య సీఎం చంద్రబాబు చిచ్చుపెట్టారని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. ఆదివారం అంకిరెడ్డిపల్లెకు చెందిన అన్నెం జయరామిరెడ్డి సోదరులతోపాటు సర్పంచ్‌ రాముడు, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, కనకాద్రిపల్లెకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు దస్తగిరి.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు రూ. 87 వేల కోట్ల రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు  తీరా అధికారంలోకి వచ్చాక రూ. 13,500 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని రైతులను నిలువునా ముంచారన్నారు. పొదుపు మహిళల రుణాలు మాఫీ చేయకుండా రూ.10వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామని యువతకు భరోసా కల్పించి..తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. దళితులకు ఏఒక్కరికైనా రెండెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎక్కడా చూసినా ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.

 హబ్‌లు ఏమయ్యాయి? 

సీఎంగా చంద్రబాబు నాయుడు మొదటి సారిగా జిల్లాకు వచ్చిన సమయంలో ప్రతి ప్రాంతాన్ని  హబ్‌లుగా మార్చుతామని హామీ ఇచ్చారని.. ఇంత వరకు అతీగతీ లేదని చక్రపాణి రెడ్డి అన్నారు.  బీజెపీతో నాలుగేళ్లు సంసారం చేసి, ప్రత్యేక హోదాతో ఏమి రాదని ప్రత్యేక ప్యాకేజి తీసుకొన్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రానికి ఇవ్వనంతగా కేంద్రం ఏపీకి ఇచ్చిందని అసెంబ్లీలో తీర్మానం చేసి స్వీట్లు పంచుకున్నారని గుర్తు చేశారు.  ఇప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకొని దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు.

రైతుల పరిస్థితి దయనీయం.. 

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్‌పై ఉన్న దృష్టి రైతాంగాన్ని ఆదుకోవడంలో లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారన్నారు. తాను 91 రోజులకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే 15 రోజుల్లోనే ఆమోదించారని, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరానని, వారి చేత రాజీనామా చేయించే దమ్ము సీఎంకు లేదా అని ప్రశ్నించారు.

నాలుగేళ్లగా బీజెపీని ఏమాత్రం ప్రశ్నించకుండా.. ఇప్పడు ధర్మపోరాటం పేరుతో అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు. మండలాధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, నాయకులు కేపీ రామ్మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, అంబటి రామ్మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు