జమిలి ఎన్నికల్లో ఉన్న మెలికలేమిటీ?

31 Jan, 2018 16:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాటి మాటికి ఈ ఎన్నికలేమిటీ? అనవసరమైన ఖర్చు. నినాదాల హోరు. మైకుల గోల. పార్టీల ప్రదర్శనలు, ర్యాలీలతో రోడ్లన్నీ రచ్చరచ్చ. ట్రాఫిక్‌ ఇబ్బందులు, స్తంభించే పౌర జీవితం, ఎన్నికల కోడ్‌. నిలిచిపోయే అభివద్ధి పనులు........ఏకకాల ఎన్నికలు నిర్వహించాలనే అంశం ఎవరు ప్రస్తావించిన మన మదిలో సందడిచేసే మాటలివి. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పోలా...! అనిపించేది ఇక్కడే. ఇది ఒకరకమైన మైండ్‌ సెట్‌కు దారితీస్తుంది. ఈ మైండ్‌ సెట్‌ కోసమే గత మూడేళ్లకుపైగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే ఏకకాల లేదా జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. చర్చ జరగాలంటున్నారు. ఎంత చర్చ జరిపితే అంత మంచిది.

లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగితే ఓటు బ్యాంకు రాజకీయాలు తగ్గుముఖం పడుతాయని, ఒకసారి ఎన్నికలు జరిగిపోతే మరో ఐదేళ్లవరకు వాటి గురించి ఆలోచించకుండా ప్రభుత్వం అభివద్ధి పనుల్లో నిమగ్నమవుతుందని, భారీ ప్రాజక్టులు చేపడుతుందని, అధికారులు మరింత చిత్తశుద్ధితో పనిచేస్తారని, పౌర సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుందని, అప్పుడు చైనాను కూడా భారత్‌ అధిగమించవచ్చని ఎవరైనా వాదించవచ్చు. ప్రజా సంక్షేమమే పరమావధిగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఇవన్నీ చేయొచ్చేమో, ఐదేళ్లపాటు తమ అధికారానికి ఆక్షేమణే ఉండదనే అహంకారంతో వ్యవహరిస్తూ దొరికినకాడికి దోచుకోవాలనే ప్రభుత్వమే అధికారంలోకి వస్తే...?

మనదీ సమాఖ్య ప్రజాతంత్ర వ్యవస్థ
భారత పార్లమెంటరీ వ్యవస్థను సమాఖ్య ప్రజాతంత్ర వ్యవస్థ అని కూడా అంటాం. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన స్పష్టంగా ఉండడమే అందుకు కారణం. ఏకకాలిక ఎన్నికల విధానం అమల్లోకి వస్తే రాష్ట్రాల అధికారాలు క్రమంగా కేంద్రానికే దఖలవుతాయి. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం పెరిగిపోతుంది. ప్రస్తుతానికి మోదీ ఈ అంశాల జోలికి వెళ్లడం లేదు. కేంద్రంతోపాటు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలని మాత్రమే కోరుతున్నారు. ఆయన కోరిక మేరకు జమిలి ఎన్నికలు జరిగాయనుకోండి. ఒకటి, రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే పరిస్థితి ఏమిటీ? మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి వీలుండదు కనుక కేంద్రమే ‘రాష్ట్రపతి పాలన’ పేరిట పాలించాలి. అలా కాకపోతే రెండో పార్టీ లేదా సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి.

సంకీర్ణ ప్రభుత్వాలు కూడా మధ్యలోనే కూలిపోయిన సందర్భాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేకం. కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే సంకీర్ణ ప్రభుత్వాలు మనుగడ సాగించగలవు. కేంద్రంలో కాంగ్రెస్‌ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్నా ఒక్కటే. అవకాశం దొరికితే ప్రభుత్వాలను కూలుస్తాయి. అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్రం డిస్మిస్‌ చేయడం అందుకు తాజా ఉదాహరణ. ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసిన ఆరు నెలల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ సూత్రం ఏకకాల ఎన్నికల్లో వర్తించదుకనుక రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్‌ చేయడం కేంద్రానికి కలిసివచ్చే అంశం.

రాష్ట్రాల్లో ఓ ప్రభుత్వం పడిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఉంటాయని ఎవరైనా వాదించవచ్చు. అదంతా సులభం కాదని ఇటీవలి రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా పరిణామాలను మలుచుకోగలదు. ఇంటెలిజెన్స్‌తోపాటు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఇన్‌కమ్‌ టాక్స్‌ సంస్థలను ఎలా ఉపయోగించుకోవచ్చో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం దారి చూపగా, ప్రస్తుత ప్రభుత్వం అందులో ఆరితేరిపోయింది.

పరస్పర విరుద్ధ తీర్పులు
కేంద్రంలో ఒక పార్టీకి, రాష్ట్రంలో ఒక పార్టీకి ఓటు వేసే సంస్కతి మన ప్రజలకు ఉంది. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీకి ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలు వచ్చాయి. ఆ మరుసటి సంవత్సరమే ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లను ఆప్‌ పార్టీ గెలుచుకుంది. బిహార్‌ విషయంలోనూ అదే జరిగింది కేంద్రంలో మోదీకి వేసిన బిహార్‌ ప్రజలు రాష్ట్రంలో జేడీయూ నాయకుడు నితీష్‌ కుమార్‌కు వేశారు. ఏకకాల ఎన్నికలకు వెళితే జాతీయ పార్టీలు, ముఖ్యంగా బలమైన రాజకీయ పార్టీల హవా నడుస్తుంది. ఆ పార్టీలు ధన బలం, కండ బలం ముందు ప్రాంతీయ పార్టీలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తణమూల్‌ కాంగ్రెస్, సీపీం పార్టీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకేపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

అధికార కేంద్రీకరణ
కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కనుసన్నల్లో పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రులు  ఢిల్లీ పెద్దల అనుమతుల కోసం నిరీక్షించాల్సి వస్తుంది. ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ లాంటి నాయకులు అధికారంలో ఉంటే అధికారాలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉంటాయి. అప్పడు భారత్‌ కూడా రష్యా లాంటి ‘మేనేజ్డ్‌ డెమోక్రసీ’ అవుతుంది.

మరిన్ని వార్తలు