సింగరేణిని ప్రైవేటు పరం కానివ్వం

28 Feb, 2018 01:46 IST|Sakshi

శ్రీరాంపూర్‌ సింగరేణి ఆత్మీయ సభలో కేసీఆర్‌ ∙కేంద్రం వాటా అమ్మేస్తే.. రాష్ట్రం తరఫున కొనేస్తాం

విద్యుత్‌ బోర్డు, ఆర్టీసీలనూ ప్రభుత్వమే నిర్వహిస్తది

మార్చి నుంచి మెడికల్‌ టెస్టులు చేయిస్తం

యూనియన్‌ నాయకులు లంచం అడిగితే చెప్పుతో కొట్టాలి

సింగరేణి కార్మికులకు సీఎం వరాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఆరు నూరైనా సరే, ప్రాణం పోయినా సరే.. సింగరేణి గనులను ప్రైవేటుపరం కానివ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఒక్క సింగరేణే కాదు ఆర్టీసీ, జెన్‌కో, ఇతర విద్యుత్‌ సంస్థలన్నీ ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని పేర్కొన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసులకు ఉద్యోగాలు ఇప్పించే పథకాన్ని మార్చి నుంచి అమలు చేస్తామన్నారు.

కార్మికులకు క్వార్టర్ల నిర్మాణం, పెన్షన్ల పెంపు, ఇంటి రుణంపై వడ్డీ మాఫీ వంటి పలు వరాలనూ ప్రకటించారు. మంగళవారం సింగరేణి ప్రాంతంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. ఆరు కొత్త భూగర్భ గనులను ప్రారంభించారు. నస్పూరులో మంచిర్యాల జిల్లా సమీకృత భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీరాంపూర్‌లో ‘సింగరేణీయులతో ఆత్మీయ సమ్మేళనం’పేరిట ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.

తమాషాకు చెప్పడం లేదు..
దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, తాము సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వబోమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘అదృష్టవశాత్తు సింగరేణి గనుల మీద కేంద్రానికి పెత్తనం లేదు. ఆరునూరైనా సరే సింగరేణిని ప్రైవేటీకరణ కానివ్వం. ఒకవేళ కేంద్రం తన వాటా అమ్ముకోదలచుకుంటే.. ఆ వాటా సొమ్ము వాళ్ల చేతుల్లో పెట్టి పంపిస్తం. కంపెనీని రాష్ట్రం చేతుల్లోకి తీసుకుంటం. ప్రాణం పోయినా సరే.. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రశ్నే లేదు. ఇది ఆషామాషీగా తమాషా కోసం చెప్పే మాట కాదు..’’అని పేర్కొన్నారు.

ప్రైవేటుపరం కానివ్వం
రాష్ట్రంలో మూడు పెద్ద ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని, అందులో ప్రధానమైనది సింగరేణి అని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ప్లాంట్లు పెట్టాలనుకున్నప్పుడు తమకు ఇవ్వాలని కొందరు ఒత్తిడి తెచ్చారన్నారు. అయినా జెన్‌కోకే అప్పగించామని, ప్లాంటుకు అవసరమైన సామగ్రి కాంట్రాక్టు బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామని తెలిపారు. దీంతో 24వేల మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఆర్టీసీలో 50 వేల మంది ఉద్యోగులున్నారని, రూ.750 కోట్లు ఇచ్చి ఆర్టీసీని కాపాడామని చెప్పారు.

త్వరలోనే కారుణ్య నియామకాలు
సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలని పేరు పెట్టడంతో.. వారసత్వ ఉద్యోగాలన్న వివాదం తలెత్తి, కార్మికులకు అన్యాయం జరిగిందని కేసీఆర్‌ చెప్పారు. అందుకే కారుణ్య నియామకాలుగా చేపడుతున్నామని, త్వరలోనే ప్రక్రియ చేపడతామని తెలిపారు. మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని, మార్చి మొదటి వారం నుంచే ఆ బోర్డు పనిచేస్తుందని చెప్పారు. సింగరేణి వైద్యారోగ్య అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారముందని, అలా జరగకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ నుంచి స్పెషలిస్టులను మెడికల్‌ బోర్డులో నియమిస్తామని వెల్లడించారు.
లంచం అడిగితే చెప్పుతో కొట్టండి

ఇంతకుముందు అధికారులే కాదు, నాయకులు కూడా లంచాలకు మరిగారని.. కార్మికుల రక్తం పీల్చారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘మీకు సేవ చేస్తమని చెప్పుకునే వాళ్లకు లంచం ఎందుకు.. సేవభావంతో చెయ్యాలెగని. ఎవరన్న లంచం అడిగితే చెప్పు తీసుకుని రెండు కొట్టాలె. ఏమన్నంటే నా దగ్గరికి రండి. కార్మికుల రక్తం పీల్చేవాళ్లు రాక్షసులే. ఇక నుంచి యూనియన్ల సభ్యత్వం కోసం చందాలు తీసుకునుడు కూడా బంద్‌ గావాలె. ఒక్క రూపాయి మాత్రమే సభ్యత్వం కోసం తీసుకోవాలె.

దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా విధివిధానాలు పంపిస్తం..’’అని పేర్కొన్నారు. సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి ఆదాయం రూ.12 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు.. లాభాలు రూ.400 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెరిగాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

కార్మికులకు సీఎం వరాలివీ..
– రిటైరైన కార్మికులకు ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్‌ వైద్యం
– శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్ల స్థానంలో రూ.400 కోట్లతో కొత్తగా 10 వేల క్వార్టర్ల నిర్మాణం.
– కేవలం రూ.300 వరకు పెన్షన్‌ తీసుకునే రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌ పెంపు.
– సింగరేణి భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికులకు పట్టాలు.
– 10 లక్షలలోపు ఇంటి రుణానికి వడ్డీ మాఫీ.
– అంబేద్కర్‌ జయంతి, రంజాన్, క్రిస్మస్‌లకు వేతనంతో కూడిన సెలవు.  

మరిన్ని వార్తలు