వాణిజ్య, వ్యాపార కేంద్రంగా సిరిసిల్ల

24 Oct, 2018 02:19 IST|Sakshi

ఆ ప్రాంత నేతన్నల స్థితిగతులు మారాయి: మంత్రి కేటీఆర్‌

నవంబర్‌ 2న సిరిసిల్లలో భారీ సభ

కేటీఆర్‌ను కలిసిన నేతన్నల ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: నేతన్నల సంక్షేమం ప్రధాన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు పాలన సాగించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్‌ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులను సంపూర్ణంగా మార్చడంతో పాటు నూతన పెట్టుబడులను ఆకర్షించి, మరింత మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో పని చేశామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతన్నల ప్రతినిధులు మంగళవారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.

సిరిసిల్ల ప్రాంత నేతన్నల స్థితిగతులు మారడంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేగా గొప్ప ఆత్మ సంతృప్తి లభించిందని పేర్కొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల స్థితిగతులు తనను ఎంతగానో కలచివేసేవని, తెలంగాణ ఏర్పడ్డాక అక్కడి నేతన్నలకు గౌరవంగా బతికేలా ఆదాయం కల్పించే కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. బతుకమ్మ చీరల వల్ల ఒక్కో కార్మికుడికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నెలసరి వేతనం పొందే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

అపెరల్‌ పార్కు ఏర్పాటుతో 10 వేల మంది మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సిరిసిల్లను టెక్స్‌టైల్‌ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామన్నారు. మిడ్‌ మానేరు పూర్తి కావడంతో సిరిసిల్లకు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని చెప్పారు. వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, నేతన్నల ఆధ్వర్యంలో సిరిసిల్లలో నవంబర్‌ 2న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు రావాలని నేతన్నలు కేటీఆర్‌ను కోరగా అందుకు అంగీకరించారు.

టీఆర్‌ఎస్‌కు సంచార జాతుల మద్దతు
టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ సంచారజాతుల సంఘం ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపింది. తెలం గాణ సంచారజాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వొంటెద్దు నరేందర్‌ ఆధ్వర్యంలో 80 కులాల బాధ్యులు ఎంపీ కవితను మంగళవారం నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. సీఎం కేసీఆర్‌ సంచారజాతులకు మేలు చేస్తున్నారని, ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని ప్రతినిధులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు