వాస్తుపై ఉన్న శ్రద్ధ మహిళా రక్షణపై ఏది?

5 Aug, 2018 02:43 IST|Sakshi

మహిళా కాంగ్రెస్‌ నేతలు సీతక్క, శారద

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌.. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఆరోపించింది. యాదాద్రిలో వెలుగుచూసిన వ్యభిచార ఘటనలకు పోలీసులు, శిశుసంక్షేమ శాఖలే బాధ్యత వహించాలని అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షు రాలు నేరెళ్ల శారద డిమాండ్‌ చేశారు.

శనివారం గాం ధీభవన్‌లో మీడియాతో సీతక్క మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌లు మహిళల భద్రతపై ప్రచార ఆర్భాటం చేస్తూ, రక్షణ మాత్రం గాలికొదిలేశారన్నారు. యాదా ద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు అక్కడ జరిగే పాపాలు పట్టవా అని ప్రశ్నించారు. వాస్తుపై పెట్టే శ్రద్ధ కూడా మహిళల రక్షణపై పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శారద ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నిద్రపోతోందని, పోలీసులు, శిశుసంక్షేమ శాఖల వైఫల్యం కారణంగానే యాదాద్రి వ్యభిచార కూపంగా మారిందన్నారు. వ్యభిచార గృహాల నిర్వాహకులపై నిర్భయ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు